దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2026 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పరిశ్రమ సంస్థ ఐసీఈఏ సోమవారం ఒక నివేదికలో తెలిపింది. నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్(ఎన్పీఈ) 2019 ప్రకారం.. 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా గతంలో నిర్దేశించింది. అయితే, ఈ రంగంపై కోవిడ్-19 మహమ్మారి ప్రతికూల ప్రభావం కారణంగా.. నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2019 నిర్దేశించిన లక్ష్యాన్ని పరిశ్రమ సాధించలేకపోతుందని నివేదిక తెలిపింది.
ఈ నేపథ్యంలో నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2019 లక్ష్యాన్ని 300 బిలియన్ డాలర్లకు తగ్గించడం సమంజసం అని ఈ నివేదికలో వివరించింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ నివేదిక వివరాలను పంచుకుంటూ.. తగ్గించిన లక్ష్యం 300 బిలియన్ డాలర్లను చేరుకోవడానికి ప్రస్తుత స్థాయి నుంచి 400 శాతం వృద్దిని సాధించాలని పేర్కొన్నారు. అందుకు, అనుకూలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నాలు అవసరం. పరిశ్రమతో సంప్రదింపులు జరపకుండా పన్ను సుంకంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయరాదని ఆయన అన్నారు.
దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మొహింద్రూ అన్నారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల డిమాండ్ 2025-26 నాటికి సుమారు 180 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. "భారతదేశం 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారీ చేయగలిగితే, దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చవచ్చు. అలాగే, 120 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయవచ్చు" అని నివేదిక తెలిపింది.
(చదవండి: ఓలా పెను సంచలనం.. ఆ జాబితాలో చేరిన తొలి ఎలక్ట్రిక్ కంపెనీ!)
Comments
Please login to add a commentAdd a comment