ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో చేరి పదేళ్లు పూర్తి కాలేదా..? ఉద్యోగుల పింఛను స్కీం (ఈపీఎస్)లో జమైన డబ్బు తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు వచ్చే నగదు కొంతమేర తగ్గనుంది. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల్లో ఈపీఎఫ్‌వో మార్పులు తీసుకొచ్చింది. ఈపీఎఫ్ పరిధిలోని సంస్థలో పని చేసిన సర్వీసును ఇప్పటివరకు ఏడాది పరంగా లెక్కగట్టేవారు. తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం సంస్థలో ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలకే లెక్కించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈపీఎస్ చట్టం, 1995 టేబుల్-డీలో కార్మికశాఖ సవరణలు చేసింది.
ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం..ఉద్యోగి ఏదేని సంస్థలో పనిచేస్తూ కనీసం పదేళ్ల ఈపీఎస్ సర్వీసు పూర్తి చేస్తేనే వారికి 58 ఏళ్లు వచ్చాక నెలవారీ పింఛను వస్తుంది. తొమ్మిదేళ్ల ఆరు నెలల సర్వీసు పూర్తి చేసినా పదేళ్లుగానే పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పింఛను రాదు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్ నిల్వలను చెల్లించదు. కనీస సర్వీసు లేనివారు మాత్రమే ఈ నగదు తీసుకునేందుకు అర్హులు.
ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పదేళ్ల సర్వీసుకంటే ముందే ఈపీఎస్ మొత్తాన్ని ఉపసంహరిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కొంతమంది రెండు, మూడేళ్లకో సంస్థ మారుతూ అప్పటికే ఈపీఎస్‌లో జమైన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. అయితే బదిలీ, ఉద్యోగం మానేసిన కారణాలతో డబ్బులను వెనక్కి తీసుకోవద్దని, మరో సంస్థకు ఆ సర్వీసును పూర్తిగా బదిలీ చేసుకుంటే పింఛను అర్హత పొందడంతోపాటు ఎక్కువ పింఛను వస్తుందని ఈపీఎఫ్‌వో అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..
ఎలా లెక్కిస్తారంటే..
ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమవుతుంది. పనిచేస్తున్న సంస్థ అంతేమొత్తంలో 12 శాతం వాటాను ఈపీఎఫ్‌కు చెల్లిస్తుంది. అయితే సంస్థ చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి, 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం సంస్థ చెల్లించే 12 శాతం వాటా (రూ.1,800)లో 8.33 శాతం అంటే రూ.1,250 ఈపీఎస్‌కు వెళ్తుంది. ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే రాజీనామా చేసినా, రిటైర్డ్ అయినా ఈపీఎస్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే అతని సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. ఒకవేళ మూలవేతనం, డీఏ కలిపి రూ.15000 ఉందనుకుందాం. ఉద్యోగి ఏడేళ్ల ఏడు నెలలు పని చేశాడనుకుంటే గతంలోని నిబంధన ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలను ఎనిమిదేళ్లుగా పరిణించేవారు. రాజీనామా లేదా ఉద్యోగ విరమణ చేసినప్పుడు మూలవేతనం రూ.15000 ఉన్నందున ఈపీఎస్ టేబుల్-డీ ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి 8.22 నిష్పత్తి చొప్పున చెల్లించేవారు. అంటే రూ.15,000 X 8.22 చొప్పున రూ.1,23,300 వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలు అంటే 91 నెలలు అవుతుంది. 91 నెలల కాలానికి నిష్పత్తి 7.61 అవుతుంది. అంటే రూ.15000 X 7.61 లెక్కన రూ.1,14,150 చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment