ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, మెటాలకు ఫ్రాన్స్ ప్రభుత్వం గట్టి షాక్‌ను ఇచ్చింది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ సమయంలో ఆన్‌లైన్ ట్రాకర్స్ కుకీస్‌ను యూజర్లు తిరస్కరించడాన్ని కష్టతరం చేసినట్లు గూగుల్, మెటాపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫ్రాన్స్ డేటా ప్రైవసీ వాచ్‌డాగ్ ఘాటుగా స్పందించింది.
భారీ జరిమానా..!
గూగుల్, మెటాలపై ఫ్రాన్స్ డైటా ప్రైవసీ వాచ్‌డాగ్ సీఎన్‌ఐఎల్ భారీ జరిమానాను విధించింది. రికార్డు స్థాయిలో గూగుల్‌పై సుమారు 150 మిలియన్ల (దాదాపు రూ. 1,265 కోట్లు) యూరోలను జరిమానాను విధించినట్లు సీఎన్‌ఐఎల్ గురువారం వెల్లడించింది. ఇదే కారణంతో మెటాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌కు కూడా భారీ జరిమానాను విధించింది. ఫేస్‌బుక్‌పై సుమారు 60 మిలియన్ల (దాదాపు రూ. 505 కోట్లు) యూరోల జరిమానా విధించినట్లు సీఎన్‌ఐఎల్ తెలిపింది.
కుకీస్‌కు ఒకే చెప్పాల్సిందే..!
మెటాకు చెందిన ఫేస్‌బుక్.కామ్‌లో, గూగుల్‌కు చెందిన google.fr బ్రౌజర్, youtube.com వెబ్‌సైట్లు యూజర్లు కుకీస్‌ను తిరస్కరించడానికి అంత సులభంగా అనుమతించవని ఫ్రాన్స్ డేటా ప్రైవసీ వాచ్‌డాగ్ సీఎన్‌ఐఎల్ గుర్తించింది. ఈ రెండు కంపెనీలకు వాచ్‌డాగ్ ఇచ్చిన ఆర్డర్స్‌ను అంగీకరించడానికి సుమారు మూడు నెలల సమయాన్ని సీఎన్‌ఐఎల్ ఇచ్చింది. ఒకవేళ ఆర్డర్స్‌ను తిరస్కరిస్తే రోజుకు సుమారు ఒక లక్ష (దాదాపు రూ. 85 కోట్లు) యూరోలను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుందని అధికార యంత్రాంగం తెలిపింది.
కుకీస్‌ను తిరస్కరించే విషయంపై గూగుల్,ఫేస్‌బుక్ యూజర్లకు తగిన ఏర్పాట్లను చేయాలని సూచించింది. కాగా ఈ వ్యవహారంపై గూగుల్ స్పందించింది. యూజర్ల ప్రైవసీపై సంస్థ కట్టుబడి ఉందని పేర్కొంది. సీఎన్‌ఐఎల్ సూచించిన మార్పులపై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని గూగుల్ ప్రతినిధి తెలిపారు.
చదవండి: టెక్ దిగ్గజాల పోరు.. మధ్యలో మన బిడ్డకు జాక్‌పాట్! రూ. కోటికిపైగా..
Comments
Please login to add a commentAdd a comment