
విదేశీ అవినీతి విధానాల చట్టం అమలుకు ట్రంప్ విరామం
వాషింగ్టన్: దాదాపు అర శతాబ్దం నాటి విదేశీ అవినీతి విధానాల చట్టం (ఎఫ్‌సీపీఏ) అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. 60 రోజుల పాటు చట్టాన్ని సమీక్షించాలని, ఈలోగా దాని కింద కొత్తగా విచారణలేవీ చేపట్టరాదని ఆయన సూచించారు.
వ్యాపార అవసరాల కోసం కంపెనీలు విదేశాల్లోని అధికారులకు లంచాలిచ్చి అవినీతికి పాల్పడకుండా నిరోధించేందుకు ఈ చట్టం లక్ష్యం. పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీపై లంచాల ఆరోపణలను ఇదే చట్టం కింద విచారణ చేస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయంతో ఆయనకు కొంత ఊరట లభించగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి.
భారత్‌లో సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అధికారులకు లంచాలిచ్చారని, అమెరికాలో నిధులను సమీకరించే క్రమంలో ఆ విషయాలను వెల్లడించలేదని అదానీ తదితరులపై గత ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సీపీఏ ప్రకారం అమెరికన్ కంపెనీలైనా, ఇతర దేశాల కంపెనీలైనా వ్యాపార అవసరాల కోసం విదేశాల్లో అధికారులకు లంచాలివ్వడం చట్టవిరుద్ధం.
Comments
Please login to add a commentAdd a comment