Over 55 Pc Jan Dhan Account Holders Are Women, Finance Minister Revealed In Parliament - Sakshi
Sakshi News home page

జన్‌ధన్‌ స్కీం.. ఇక్కడ కూడా అత్యధిక లబ్ధి గుజరాతీయులకే !

Published Tue, Dec 7 2021 1:02 PM | Last Updated on Tue, Dec 7 2021 1:37 PM

Finance Minister Revealed Jan Dhan Scheme Details In Parliament - Sakshi

న్యూఢిల్లీ: జన్‌ ధన్‌ ఖాతాల్లో మహిళా సాధికారత కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 44 కోట్ల జన్‌ ధన్‌ అకౌంట్‌ హోల్డర్లలో 24.42 కోట్లు మహిళలు కావడం గమనార్హం. అంటే మొత్తం ఖాతాల్లో వీరి వాటా దాదాపు 55 శాతమన్నమాట. ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాద్‌ లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన అంశాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 2021 నవంబర్‌ 17వ తేదీ నాటికి దేశంలో ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన కింద లబ్దిదారుల సంఖ్య 43.90 కోట్లు. వీరిలో 24.42 కోట్ల మంది మహిళలు ఉన్నారు. జన్‌ ధన్‌ స్కీమ్‌ కింద లబ్ది పొందిన వారిలో అత్యధికులు గుజరాతీయులు ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 1.65 కోట్లు. అయితే వీరిలో 0.84 కోట్ల మంది (51 శాతం) మహిళా ఖాతాదారులు.  



లక్ష్యం ఏమిటి? 
దేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆర్థిక చట్రంలో వారిని భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో 2014 ఆగస్టు 15న కేంద్రం ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ’ప్రతి కుటుంబం’ నుండి ’ప్రతి అన్‌ అకౌంట్‌ హోల్డర్‌’ ఖాతా తెరవాలన్న ప్రధాన లక్ష్యంగా కొన్ని మార్పులతో ఈ పథకాన్ని  2018 ఆగస్టు 14 తర్వాత పొడిగించారు. ఈ అకౌంట్లలో ఎటువంటి కనీస నగదు నిల్వనూ నిర్వహించాల్సిన అవసరం లేదు. కాగా, డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించిన ఫీజులంటూ ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన (పీఎంజేడీవై)ఖాతాదారుల నుండి వసూలు చేసిన మొత్తంలో  కేవలం రూ.90 కోట్లు చెల్లించిన ఎస్‌బీఐ, ఇంకా రూ. 164 కోట్ల రుసుమును రిఫండ్‌ చేయలేదని ఇటీవల ఐఐటీ–ముంబై నివేదిక ఒకటి తెలిపింది. ఎస్‌బీఐ ఏప్రిల్‌ 2017–డిసెంబర్‌ 2019 మధ్య డిజిటల్‌ చెల్లింపుల రుసుం పేరుతో జన్‌దన్‌ ఖాతాదారుల నుంచి దాదాపు 254 కోట్లు వసూలు చేసింది. దాదాపు 14 కోట్ల యూపీఐ/రూపీ లావాదేవీలకు సంబంధించి జన్‌ ధన్‌ ఖాతాల బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ అకౌంట్‌ నుంచి ఈ డబ్బును ఫీజు రూపంలో (లావాదేవీకి రూ.17.70 చొప్పున) వసూలు చేసింది. అయితే దీనిని అసమంజసంగా భావించిన కేంద్రం రిఫండ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.


సుకన్య సంమృద్ధి యోజన అకౌంట్లు  1,42,73,910 
మహిళా సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టిన పొదుపు పథకం సుకన్య సంమృద్ధి యోజన అకౌంట్ల (ఎస్‌ఎస్‌ఏ) గురించి అడిగిన మరో ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి మాట్లాడుతూ, ఈ పథకం కింద 2018 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2021 అక్టోబర్‌ 31 మధ్య దేశంలో మొత్తం 1,42,73,910 కోట్ల అకౌంట్లు నమోదయినట్లు తెలిపారు. ఈ ఖాతాల్లో అత్యధికంగా ఉన్న తొలి ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయనన్నారు. లక్షద్వీప్, అండమాన్‌ – నికోబార్‌ దీవులు, లడఖ్, మిజోరాం, సిక్కిం చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. ప్రారంభంలో 9.1 శాతం ఉన్న వడ్డీరేటు ప్రస్తుతం 7.6 శాతానికి తగ్గింది. 
 

చదవండి: వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్బీఐ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement