Jan dhan Yojana scheme
-
జన్‌ధన్ స్కీం.. ఇక్కడ కూడా అత్యధిక లబ్ధి గుజరాతీయులకే !
న్యూఢిల్లీ: జన్ ధన్ ఖాతాల్లో మహిళా సాధికారత కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 44 కోట్ల జన్ ధన్ అకౌంట్ హోల్డర్లలో 24.42 కోట్లు మహిళలు కావడం గమనార్హం. అంటే మొత్తం ఖాతాల్లో వీరి వాటా దాదాపు 55 శాతమన్నమాట. ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన అంశాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 2021 నవంబర్ 17వ తేదీ నాటికి దేశంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద లబ్దిదారుల సంఖ్య 43.90 కోట్లు. వీరిలో 24.42 కోట్ల మంది మహిళలు ఉన్నారు. జన్ ధన్ స్కీమ్ కింద లబ్ది పొందిన వారిలో అత్యధికులు గుజరాతీయులు ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 1.65 కోట్లు. అయితే వీరిలో 0.84 కోట్ల మంది (51 శాతం) మహిళా ఖాతాదారులు. లక్ష్యం ఏమిటి? దేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆర్థిక చట్రంలో వారిని భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో 2014 ఆగస్టు 15న కేంద్రం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ’ప్రతి కుటుంబం’ నుండి ’ప్రతి అన్ అకౌంట్ హోల్డర్’ ఖాతా తెరవాలన్న ప్రధాన లక్ష్యంగా కొన్ని మార్పులతో ఈ పథకాన్ని 2018 ఆగస్టు 14 తర్వాత పొడిగించారు. ఈ అకౌంట్లలో ఎటువంటి కనీస నగదు నిల్వనూ నిర్వహించాల్సిన అవసరం లేదు. కాగా, డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ఫీజులంటూ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)ఖాతాదారుల నుండి వసూలు చేసిన మొత్తంలో కేవలం రూ.90 కోట్లు చెల్లించిన ఎస్బీఐ, ఇంకా రూ. 164 కోట్ల రుసుమును రిఫండ్ చేయలేదని ఇటీవల ఐఐటీ–ముంబై నివేదిక ఒకటి తెలిపింది. ఎస్బీఐ ఏప్రిల్ 2017–డిసెంబర్ 2019 మధ్య డిజిటల్ చెల్లింపుల రుసుం పేరుతో జన్‌దన్ ఖాతాదారుల నుంచి దాదాపు 254 కోట్లు వసూలు చేసింది. దాదాపు 14 కోట్ల యూపీఐ/రూపీ లావాదేవీలకు సంబంధించి జన్ ధన్ ఖాతాల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ నుంచి ఈ డబ్బును ఫీజు రూపంలో (లావాదేవీకి రూ.17.70 చొప్పున) వసూలు చేసింది. అయితే దీనిని అసమంజసంగా భావించిన కేంద్రం రిఫండ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. సుకన్య సంమృద్ధి యోజన అకౌంట్లు 1,42,73,910 మహిళా సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టిన పొదుపు పథకం సుకన్య సంమృద్ధి యోజన అకౌంట్ల (ఎస్ఎస్ఏ) గురించి అడిగిన మరో ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ, ఈ పథకం కింద 2018 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య దేశంలో మొత్తం 1,42,73,910 కోట్ల అకౌంట్లు నమోదయినట్లు తెలిపారు. ఈ ఖాతాల్లో అత్యధికంగా ఉన్న తొలి ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయనన్నారు. లక్షద్వీప్, అండమాన్ – నికోబార్ దీవులు, లడఖ్, మిజోరాం, సిక్కిం చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. ప్రారంభంలో 9.1 శాతం ఉన్న వడ్డీరేటు ప్రస్తుతం 7.6 శాతానికి తగ్గింది. చదవండి: వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్బీఐ? -
ముంగిట్లో జన్‘ధన్’!
సాక్షి, హైదరాబాద్: జన్ ధన్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయాన్ని వారి చెంతనే పంపిణీ చేసేలా బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా నగదు ఉపసంహరణకు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా గ్రామాల్లో సింగిల్ టేబుల్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని నేరుగా ఖాతాలో జమచేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 2 నుంచి నగదు జమ చేస్తోంది. ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో నిర్దేశిత పద్దతిలో ఈ నగదును జమ చేస్తుండగా... నిర్దేశిత తేదీల్లో ఆయా ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే 50శాతం ఖాతాల్లో నగదు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సులభంగా... వేగంగా... జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్రం నిర్దేశిత తేదీలు ప్రకటించింది. ఈనెల 10వ తేదీ నుంచి విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుం డా నేరుగా గ్రామంలోనే నగదును విత్‌డ్రా చేసుకునే వీలు కల్పిస్తోంది. బ్యాంకు మిత్ర, బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా బ్యాంకు శాఖ సర్వీస్ ఏరియాలోని ప్రతి గ్రామంలో సింగిల్ టేబుల్ కౌంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఎస్ఎల్బీసీ సూచించిన విధంగా నగదు చెల్లింపులు చేపట్టనున్నాయి. రెండ్రోజులుగా కొ న్ని బ్యాంకులు ప్రయోగాత్మకంగా చెల్లింపులు ప్రారంభించగా... మిగతా బ్యాంకులన్నీ మరో రెండ్రోజుల్లో ఈ సింగిల్ టేబుల్ కౌంటర్లు ఏర్పా టు చేసేందుకు చర్యలు వేగవంతం చేశాయి. -
ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంకు అకౌంట్లుండాలి
విజయనగరం కంటోన్మెంట్: జన్‌ధన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంకు అకౌంట్లు ఉండాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి బ్యాంకు అకౌంట్లు తక్షణమే తెరిపించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన తహశీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సహకరించని బ్యాంకర్ల వివరాలు తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. మొదటి దశ రుణమాఫీ కార్యక్రమం కింద లబ్ధిపొందని రైతుల ఫిర్యాదులను పరిష్కరించి అప్లోడ్ చేయాలన్నారు. వేరే మండలానికి చెందిన ఫిర్యాదులను ఆయా మండలాలకు పంపించి పరిష్కరించాలని సూచించారు. రెండో దశకు అర్హులైన వారి వివరాలను త్వరితంగా అప్లోడ్ చేయాలన్నారు. రైతులకు అందజేస్తున్న ఈ పాస్ పుస్తకాలు వెయ్యి వరకూ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన అందజేయాలన్నారు.వయోజన విద్యా కేంద్రాల్లో చదువుతున్న వారికి మార్చి 15వ తేదీన పరీక్ష జరగనుందని, ఈ పరీక్షకు అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ఇన్విజిలేటర్ల నియామకం, వసతుల ఏర్పాటు వంటి ప్రక్రియలు చేపట్టామని తెలిపారు. గతసారి హాజరు కానివారు, హాజరై పరీక్షలో ఫెయిల్ అయిన వారు మాత్రమే ఈ పరీక్షకు హాజరు కావాలని స్పష్టం చేశారు. సాక్షరభారత్ 5వ ఫేజ్ కింద జనవరి1వ తేదీనుంచి తరగతులు ప్రారంభమయ్యాయని, వారికి 6 నెలల తరువాత పరీక్ష నిర్వహిస్తారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ జి.రాజకుమారి, ఆర్డీఓ జె. వెంకటరావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ గాయత్రీ దేవి, డ్వామా ఏపీడీ అప్పలనాయుడు, వయోజన విద్యా ఉప సంచాలకులు ఎం.అమ్మాజీరావు, మండలాల నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు పాల్గొన్నారు. -
కష్టాల ఖాతా
‘జన్‌ధన్ యోజన’ లక్ష్యం ప్రశ్నార్థకం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జన్‌ధన్ యోజన’ లక్ష్యం నీరుగారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నా యి. ప్రతి పౌరుడూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర పథకానికి అలసత్వం ఆవరిం చింది. జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు అకౌంటు తెరవాలనే కేంద్ర ప్రభుత్వ సం కల్పం నిర్వీర్యమవుతోంది. సత్తుపల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్‌ధన్ యోజన’ ప్రశ్నార్థకంగా మారింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ లక్ష్యం నీరుగారిపోతోంది. ఈ పథకం కింద బ్యాంకులో అకౌంట్ తెరవాలంటే బయట ఇంటర్నెట్ సెంటర్లలో ఆన్లైన్ చేయించుకుని రావాలంటూ బ్యాంకర్లు అంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆన్లైన్ కోసం ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రూ.100 చెల్లిస్తే ఆన్లైన్ చేసి సంబంధిత పత్రాల కాపీలు అందిస్తున్నారు. అవి తీసుకొని బ్యాంకుకు వెళ్తే క్యూలైన్లో గంటల తరబడి నిల్చొవాల్సి వస్తోంది. ఈ క్రమంలో మరో రూ.500 చెల్లిస్తే బ్యాంకుకు కూడా వెళ్లే పనిలేకుండా ఇంటర్నెట్సెంటర్ నిర్వాహకులు బ్యాంకులో ఖాతాలు తెరిపిస్తున్నారు. రూ.500 మాత్రం ఖాతాదారుడి అకౌంట్లో తిరిగి జమ అవుతుంది. పైసా లేకుండా జీరో అకౌంట్ తెరవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఆచరణలో అమలు కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.600 ఖర్చుపెడితేనే బ్యాంక్ అకౌంట్ తెరవాల్సిన పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఉంటేనే ఖాతా అన్నట్లు కొన్ని బ్యాంకులు వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తున్నారు. డబ్బులు పెట్టి అకౌంట్ తెరవలేని వాళ్ల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెడితే అది పక్కదారి పడుతోందని అంటున్నారు. సిబ్బంది లేకపోవడమే! చాలా బ్యాంకుల్లో అనుకున్న స్థాయిలో సిబ్బంది లేకపోవటం వల్లే అవుట్సోర్సింగ్ పద్ధతిన జన్‌ధన్ యోజన పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సిబ్బంది లేకపోవడానికి తోడు రుణమాఫీ జాబితాల్లో మార్పులు, చేర్పులతో సిబ్బంది తలమునకలవుతున్నామని బ్యాంకర్లు అంటున్నారు. రోజుకో నిబంధనలు వస్తుండటంతో రుణమాఫీ జాబితాల తయారీతోనే బిజీబిజీగా గడపాల్సి వస్తోందని చెబుతున్నారు. అదీగాక సెప్టెంబర్ నెలాఖరులోగా త్రైమాసిక బడ్జెట్ టార్గెట్ పూర్తి చేయాల్సి ఉండటంతో సతమతమవుతున్నామనిఅంటున్నారు. రోజుకు కనీసం 100 నుంచి 150 వరకు ఒక్కొక్క బ్యాంకు ఖాతాలు తెరవాల్సిన పరిస్థితులు ఉండటంతో దానికి సరిపడా సిబ్బంది లేకపోవటం వల్లనే ఆన్లైన్ అవుట్‌సోర్సింగ్‌లో చేపడుతున్నట్లు తెలుస్తోంది. పథకంతో ఉపయోగమేమిటంటే... జన్‌ధన్ అకౌంట్ తీసుకున్న ఖాతాదారుడికి రూ.లక్ష ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఆరు నెలల తర్వాత రూ.5వేలు ఓవర్డ్రాప్ రూపంలో వాయిదాల పద్ధతిన చెల్లించే విధంగా వడ్డీ లేని రుణం అందుతుంది. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు నేరుగా చేరేందుకు బ్యాంకు అకౌంట్లు వినియోగించే అవకాశం ఉంది. దీంతో అకౌంట్లు లేనివాళ్లు తెరిచేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. -
‘జన్ ధన్’ ఉంటే ఉచిత సిమ్
- వినియోగదారులకు మెరుగైన సేవలు - 3 జీ సేవలు మరింత విస్తృతం - బీఎస్ఎన్ఎల్ జీఎం మహంతి శ్రీకాకుళం అర్బన్: ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు నూతన పోకడలతో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ హెచ్.సీ.మహంతి అన్నారు. శ్రీకాకుళంలోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన పథకం కింద రూ.20 విలువ చేసే ప్రీ-పెయిడ్ సిమ్‌ను ఉచి తంగా అందజేస్తున్నామన్నారు. సిమ్‌ను పొందగోరేవారు తమ ఫొటోతోపాటు జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతా ప్రతులను సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ పథకంతో లబ్ధిదారులందరికీ బ్యాంకు ఖాతాతోపాటు సెల్‌ఫోన్ కనెక్షన్ ఉంటుందన్నారు. తమ సంస్థ అత్యుత్తమ ఆఫర్లను ప్రవేశపెట్టిందని.. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూ. 100 నుంచి రూ. 1000 వరకూ ఫుల్‌టాక్‌టైమ్, రూ. 1010 నుంచి రూ. 2,990 వరకు 10 శాతం అదనపు టాక్‌టైమ్‌తో ప్యాకేజీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఆఫర్ ఈనెల 22వ తేదీ వరకు మాత్రమే ఉంటుందన్నారు. అలాగే కొత్త కూంబో ఎస్టీవీ ప్లాన్ కింద రూ. 111లకు రూ. 90 టాక్‌టైమ్‌తోపాటు 70 నిమిషాల ఇంటర్నెట్ సదుపాయం ఉంటుందన్నారు. రూ. 222 ప్లాన్‌లో రూ.190 టాక్‌టైమ్‌తోపాటు రూ. 110 నిమిషాల ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగించుకునే వినియోగదారులకు కూడా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. బీబీహోమ్ యూఎల్ రూ. 525 పథకాన్ని మార్పుచేసి బీబీహోమ్ యూఎల్ రూ.545 పథకం కింద 512 కేబీపీఎస్ నెల మొత్తంగా వర్తించే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3.50 లక్షలు మంది బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఉన్నారని..వీరికి మెరుగైన సేవలు అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 203 2జీ సెల్‌టవర్లు ఏర్పాటు చేశామని..అలాగే 3జీ సెల్‌టవర్లు 63 ఉన్నాయన్నారు. మరింత మెరుగైన సిగ్నల్స్ కోసం పురుషొత్తపురం, తామరాపల్లి గ్రామాల్లో త్వరలో సెల్‌టవర్లు నిర్మించనున్నామన్నారు. నరసన్నపేట, టెక్కలి, పాతపట్నంలతోపాటు పాలకొండకు కూడా 3జీ సెల్ సర్వీస్ ఏర్పాటు చేయబడ్డాయని, శ్రీకాకుళం పట్టణం, ఆమదాలవలస, సోంపేటలకు 3జీ సేవలను మరింతగా విస్తృత పరిచామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 17 కొత్త సెల్‌టవర్లు ప్రారంభించామన్నారు. పలాస పరిధిలో ఫ్రాంచేజీ కోసం ఓపెన్బిడ్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి, సంతబొమ్మాళి మండలాలు దీని పరిధిలో ఉన్నాయన్నారు. ఈ బిడ్‌కు ఆఖరుతేదీ ఈనెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలలోగా అందజేయాలన్నారు. సమావేశం లో ఏజీఎం డి.మహేశ్వరరావు, ఏజీఎం(పరిపాలన) బీవీవీ నగేష్, సీఏవో జె.నాగరాజు, ఏఈ శైలూప్రసాద్, యూనియన్ నాయకులు డి.వెంకటేశ్వరరావు, బి.జగన్నాథం పాల్గొన్నారు. -
4 కోట్లకు జన ధన ఖాతాలు
ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీల బదిలీ యోచన న్యూఢిల్లీ: జన ధన యోజన పథకం కింద ఇప్పటివరకూ 4 కోట్ల ఖాతాలను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. తద్వారా రూ. 3,700 కోట్ల డిపాజిట్లను సమీకరించినట్లు వెల్లడించింది. వెరసి ఒక్కో ఖాతాపైనా సుమారుగా రూ. 900 జమ అయినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి జీఎస్ సంధు చెప్పారు. ప్రధాని మోదీ ఆగస్ట్ 28న ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే ఉన్న ఖాతాను వినియోగించుకునే సౌకర్యాన్ని సైతం ప్రభుత్వం కల్పించింది. ఆధార్‌తో అనుసంధానించే ఈ పథకంలో ప్రధానంగా రూ. 5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పించనున్నాయి. ఇక రుపే డెబిట్ కార్డ్ ద్వారా రూ. లక్ష వరకూ ప్రమాద బీమా లభిస్తుంది. ఇవికాకుండా రూ. 30,000 వరకూ జీవిత బీమాను కూడా ప్రభుత్వం కల్పించింది. కాగా, వినియోగదారులు కొనుగోలు చేసే కిరోసిన్, వంటగ్యాస్‌పై సబ్సిడీలను నేరుగా జన ధన యోజన ఖాతాలలోకి బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంధు చెప్పారు. తద్వారా మార్కెట్ ధరలకే వినియోగదారులు కిరోసిస్, వంటగ్యాస్‌లను కొనుగోలు చేసేందుకు వీలు చిక్కనుంది. -
ఎస్బీఐ.. ‘అనుబంధ బ్యాంకుల్లో’పీవో కొలువు కోసం..
చక్కటి పని వాతావరణం, కెరీర్లో చకచకా ఎదిగేందుకు పుష్కల అవకాశాలు.. బ్యాంకు ఉద్యోగాల పట్ల యువత ఆకర్షితులవుతుండటానికి కారణాలు. ప్రస్తుతం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగం కేంద్ర ప్రభుత్వ విధానాల (జన్ ధన్ యోజన పథకం వంటివి)తో మరింత అభివృద్ధి సాధించే దిశగా కదులుతోంది. ఈ క్రమంలోనే తరచూ బ్యాంకు ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హత: ఏదైనా గ్రూపులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులు. వయసు: 2014, సెప్టెంబర్ 1 నాటికి కనీస వయసు 21 ఏళ్లు. గరిష్ట వయసు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు (ఎస్సీ, ఎస్టీ-15 ఏళ్లు; ఓబీసీ-13 ఏళ్లు; జనరల్-పదేళ్లు) సడలింపు ఉంటుంది.ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్ ఆధారిత పరీక్ష, రెండో దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి.మొదటి దశ పరీక్ష విధానం: ఇందులో రెండు విభాగాలుంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్లో జరుగుతుంది. సమయం రెండు గంటలు.ఇందులో నాలుగు సెక్షన్లుంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు కేటాయించారు. అవి.. 1. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 2. జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్ 3. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ 4. రీజనింగ్ (ఉన్నత స్థాయి). డిస్క్రిప్టివ్ టెస్ట్: 50 మార్కులకు ఉంటుంది. సమయం గంట. ప్రశ్నలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. సమాధానాలు పేపర్‌పై రాయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలపై ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారి డిస్క్రిప్టివ్ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. రెండో దశ: గ్రూప్ డిస్కషన్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయించారు. మొదటి దశలో నిర్దేశ కటాఫ్ సాధించిన వారు మాత్రమే రెండో దశ పరీక్షకు అర్హులు.తుది ఎంపిక: మొదటి దశ 250 మార్కులను 75 మార్కులకు, రెండో దశ 50 మార్కులను 25 మార్కులకు మారుస్తారు. మొత్తం వంద మార్కులను పరిగణనలోకి తీసుకొని తుది జాబితా రూపొందిస్తారు. ముఖ్య వివరాలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 1, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 18, 2014. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100, ఇతరులకు రూ.500. దరఖాస్తు ఫీజు చెల్లింపు (ఆన్లైన్): సెప్టెంబర్ 1, 2014 - సెప్టెంబర్ 18, 2014. దరఖాస్తు ఫీజు చెల్లింపు (ఆఫ్‌లైన్): సెప్టెంబర్ 3, 2014-సెప్టెంబర్ 20, 2014. హాల్ టికెట్ డౌన్లోడ్: 2014, అక్టోబర్ 24 తర్వాత పరీక్ష తేదీ: 2014, నవంబర్‌లో. వెబ్సైట్: www.statebankofindia.com; www.sbi.co.in పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం, వరంగల్. ప్రిపరేషన్ ఏ పోటీ పరీక్షకైనా వేగం, కచ్చితత్వం అనేవి రెండు చక్రాల వంటివి. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే విజయం సొంతమవుతుంది.జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగం సులువే కానీ మాతృభాష కాని కారణంగా కష్టంగా అనిపిస్తుంది. ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులకు కూడా ఈ విభాగం మరీ సులువుగా అనిపించదు. ఇందులో వొకాబ్యులరీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. కొన్ని పదాలకు ఆంటోనిమ్స్, కొన్ని పదాలకు సినానిమ్స్ గుర్తించాలి. రోజూ కొన్ని కొత్త పదాలకు సమానార్థాలు, వ్యతిరేకార్థాలు నేర్చుకుంటే సమాధానాలు గుర్తించడం తేలికవుతుంది. ఇంగ్లిష్ వ్యాకరణంపైనా పట్టు సాధించాలి. ఒక వాక్యాన్ని కొన్ని భాగాలుగా విభజించి, ఏ భాగంలో తప్పు ఉందో కనుక్కోమనే ప్రశ్నలకు.. ఖాళీలు పూరించేందుకు వ్యాకరణ అభ్యసనం ఉపయోగపడుతుంది. ఆర్టికల్స్, టెన్సెస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తదితర అంశాలను నేర్చుకోవాలి. జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్: రోజూ దినపత్రికలు చదువుతూ, టీవీ వార్తలు వింటూ ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, బిజినెస్ లైన్ వంటి పేపర్లు; ఇతర దినపత్రికల్లోని బిజినెస్ పేజీలను చదవడం ద్వారా బ్యాంకింగ్ రంగ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వారు అందిస్తున్న డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్ ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి. ఈ డిప్లొమా లేని వారు కనీసం సంబంధిత మెటీరియల్‌ను అయినా చదవాలి. కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. మార్కెటింగ్‌కు సంబంధించి మార్కెట్, అడ్వర్టైజింగ్, సేల్స్, ప్రొడక్షన్, కస్టమర్ పర్సెప్షన్ తదితర అంశాలను చదవాలి.డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్: సాధారణంగా ఈ విభాగం నుంచి 10-20 వరకు ప్రశ్నలు వస్తాయి. కానీ, ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల పీవో పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్థానంలో దాదాపు పూర్తిగా డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్‌పై ప్రశ్నలుంటాయి. అందువల్ల టేబుల్స్, పై చార్ట్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, డాటా సఫిసియెన్సీలపై పట్టు సాధించాలి. దీనికోసం శాతాలు, సరాసరి, నిష్పత్తులు తదితరాలను అభ్యసించాలి. రీజనింగ్: ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్‌పై ఆధారపడిన ప్రశ్నలుంటాయి. సిరీస్,అనాలజీస్, క్లాసిఫికేషన్, స్టేట్మెంట్-ఆర్గ్యుమెంట్స్, బ్లడ్ రిలేషన్స్,సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్స్, సిల్లోజం తదితర అంశాలపై పట్టు సాధించాలి. లాజికల్ రీజనింగ్‌లో వెన్డయాగ్రమ్స్పై ఆధారపడిన ప్రశ్నలుంటాయి. తార్కికంగా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సిన ప్రశ్నలూ ఉంటాయి. అందువల్ల సమాచారాన్ని విశ్లేషించి,వేగంగా సమాధానాలు గుర్తించే నేర్పును సొంతం చేసుకోవాలి.డిస్క్రిప్టివ్ టెస్ట్: ప్రశ్నలు కాంప్రెహెన్షన్, ప్రిసైస్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎస్సేలపై ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా అభ్యర్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. అభ్యర్థులు అందరికీ అర్థమయ్యే పదాలతో ఉత్తరాలు, వర్తమాన సంఘటనలపై ఎస్సేలు రాయడం సాధన చేయాలి. కెరీర్ పీవో జీతభత్యాలు పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటాయి. ముంబైలో అయితే రూ.65 వేల వరకు వస్తుంది. ఇతర మెట్రో నగరాల్లోనూ దాదాపు ఇంతే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.35 వేలు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో వారికి వీటికి మధ్యస్థంగా ఉంటుంది. పీవో ఉద్యోగాన్ని జూనియర్ మేనేజ్‌మెంట్‌గా పరిగణిస్తారు. ప్రొబేషన్ పూర్తయ్యాక అసిస్టెంట్ మేనేజర్ హోదా ఇస్తారు. పదోన్నతి ద్వారా మిడిల్ మేనేజ్మెంట్ స్థాయికి ఎదుగుతారు. అక్కడ డిప్యూటీ మేనేజర్, మేనేజర్ అనే రెండు స్థాయిలుంటాయి. ఆ తర్వాత ప్రమోషన్ సీనియర్ మేనేజ్మెంట్ హోదా. అందులో చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విభాగాలుంటాయి. వీటి తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ హోదాలు టాప్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి చెందినవి. ఈ విధంగా స్కేల్ 1 నుంచి ఏడు వరకు వివిధ స్కేళ్లు ఉంటాయి. ఆ తర్వాత రెండు ప్రత్యేక స్కేళ్లుంటాయి. వీటిలో మొదటిది చీఫ్ జనరల్ మేనేజర్, రెండోది మేనేజింగ్ డెరైక్టర్. బ్యాంకుల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు గతంలో పీవోగా ఉద్యోగ జీవితం ప్రారంభించినవారే! విన్నర్ వాయిస్ ఇంగ్లిష్‌లో మంచి స్కోర్ సాధించాలంటే వొకాబ్యులరీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దీనివల్ల ప్యాసేజ్‌ల నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకునేందుకు, క్లోజ్ టెస్ట్, సినానిమ్స్, ఆంటోనిమ్స్ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం తేలికవుతుంది. బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. డేటా ఇంటర్ప్రెటేషన్లో ముఖ్యంగా టేబుల్, బార్, పై డయాగ్రమ్స్, పారాగ్రాఫ్ అనాలిసిస్ ప్రశ్నలు వస్తాయి. వీటికి త్వరగా కచ్చితమైన సమాధానాలు గుర్తించాలంటే తొలుత ఇచ్చిన సమాచారాన్ని సులువుగా అర్థమయ్యేలా టేబుల్ రూపంలో మలచుకునే నైపుణ్యాన్ని సంపాదించాలి. ప్రతి ప్రశ్నకు సంబంధించి చల రాశులు (ఠ్చిటజ్చీఛ్ఛట), యూనిట్లను పరిగణనలోకి తీసుకోవాలి. రీజనింగ్‌లో ఎరేంజ్మెంట్స్, ఎన్కోడింగ్-డీకోడింగ్, సింబల్స్- నొటేషన్స్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్ అంశాలపై దృష్టిసారిస్తే తేలిగ్గానే కటాఫ్‌ను దాటొచ్చు. అభ్యర్థి తన భావాలను, పరిజ్ఞానాన్ని ఇంగ్లిష్‌లో ఎలా వ్యక్తం చేస్తున్నాడో తెలుసుకోవడమే లక్ష్యంగా డిస్క్రిప్టివ్ పేపరు ఉంటుంది. ప్రతియోగితా దర్పణ్, ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు, జనరల్ అవేర్‌నెస్‌కు, ఇంగ్లిష్ విభాగాలకు ఉపయోగకరం. టైం పెట్టుకొని, వీలైనన్ని మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. - జి.సాయి రమ్యశ్రీ, ఎస్బీఐ పీవో విజేత (2013). -
జన్-ధన్‌తో పేదరికం తొలగిపోతుంది: బాబు
సాక్షి, రాజమండ్రి/తిరుపతి: జాతీయ ఆర్థిక సమీకృత పథకం ప్రధానమంత్రి జన్-ధన్ యోజనను రాష్ట్రంలో బ్యాంకుమిత్రలతో అనుసంధానం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన జన్-ధన్ యోజన పథకాన్ని రాజమండ్రిలో గురువారం ఆయన ప్రారంభించారు. ప్రతి 2 వేల బ్యాంకు ఖాతాలకు ఒక బ్యాంకుమిత్రను నియమిస్తామన్నారు. వారు బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో బ్యాంకులకు రాలేని వృద్ధులు, విక లాంగుల వంటి వారి ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తారన్నారు. పేదలకు ఆసరా: జన్-ధన్ యోజన పథకాన్ని తిరుపతిలో కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత గంగారామ్ గీతె గురువారం ప్రారంభించారు. -
‘ధన జన’పై బ్యాంకుల ఆసక్తి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రైవేటు బ్యాంకులు ప్రధానమంత్రి జన ధన యోజన పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడానికి ప్రైవేటు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన జన ధన యోజన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నట్లు దేశీయ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐతో పాటు డీసీబీ బ్యాంక్, యాక్సిస్, ఫెడరల్ బ్యాంకులు ప్రకటించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ పథకం కింద 25 లక్షల ఖాతాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తెలిపారు. తమ 3700 శాఖల నెట్‌వర్క్‌లో ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినప్పటికీ గ్రామీణ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్న డీసీబీ బ్యాంక్ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించినట్లు డీసీబీ బ్యాంక్ అగ్రి, ఇంక్లూజివ్ బ్యాంక్ హెడ్ నరేంద్రనాథ్ మిశ్రా తెలిపారు. ఈ పథకం ప్రారంభిస్తున్న గురువారం ఒక్క రోజులో దేశ వ్యాప్తంగా కోటి ఖాతాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా కోటిన్నర ఖాతాలను తెరవడం విశేషం. ప్రభుత్వం రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతోనే ఈ విజయం సాధ్యమైందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మాకు 2.5 లక్షల ఖాతాలను తెరిపించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించగా, ఏకంగా 4.7 లక్షల ఖాతాలను ప్రారంభించామని, ఇందులో ప్రైవేటు బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాయని తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్, ఎస్బీహెచ్ ఎండి శంతను ముఖర్జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మార్కెట్లోకి వేగంగా చొచ్చుకు వెళ్ళగలుగుతున్నామని, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 15,600 గ్రామాల్లోకి ప్రవేశించ గలిగినట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఈ ఒక్క రోజులోనే 3.62 లక్షల ఖాతాలను తెరిచినట్లు ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. ఎస్బీఐ స్పాన్సర్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 90,773 ఖాతాలను ప్రారంభించినట్లు ఆ బ్యాంక్ చైర్మన్ వి.నర్సిరెడ్డి పేర్కొన్నారు. బీమా కంపెనీలు కూడా.. ఈ కార్యక్రమంలో ప్రైవేటు బ్యాంకులే కాకుండా ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ముందుకు రావడం విశేషం. జన ధన యోజన పథకం కింద ఖాతాదారునికి అందిస్తున్న ఉచిత బీమా రక్షణను కల్పించడానికి ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ ఎర్గో ముందుకొచ్చింది. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఫైనాన్సియల్ సంస్థలు ముందుకొస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యాలను నిర్దేశిత కాలానికంటే ముందే చేరుకోగలమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.