కష్టాల ఖాతా
‘జన్‌ధన్ యోజన’ లక్ష్యం ప్రశ్నార్థకం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జన్‌ధన్ యోజన’ లక్ష్యం నీరుగారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నా యి. ప్రతి పౌరుడూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర పథకానికి అలసత్వం ఆవరిం చింది. జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు అకౌంటు తెరవాలనే కేంద్ర ప్రభుత్వ సం కల్పం నిర్వీర్యమవుతోంది.
సత్తుపల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్‌ధన్ యోజన’ ప్రశ్నార్థకంగా మారింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ లక్ష్యం నీరుగారిపోతోంది. ఈ పథకం కింద బ్యాంకులో అకౌంట్ తెరవాలంటే బయట ఇంటర్నెట్ సెంటర్లలో ఆన్‌లైన్ చేయించుకుని రావాలంటూ బ్యాంకర్లు అంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆన్‌లైన్ కోసం ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రూ.100 చెల్లిస్తే ఆన్‌లైన్ చేసి సంబంధిత పత్రాల కాపీలు అందిస్తున్నారు. అవి తీసుకొని బ్యాంకుకు వెళ్తే క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చొవాల్సి వస్తోంది. ఈ క్రమంలో మరో రూ.500 చెల్లిస్తే బ్యాంకుకు కూడా వెళ్లే పనిలేకుండా ఇంటర్నెట్‌సెంటర్ నిర్వాహకులు బ్యాంకులో ఖాతాలు తెరిపిస్తున్నారు. రూ.500 మాత్రం ఖాతాదారుడి అకౌంట్‌లో తిరిగి జమ అవుతుంది.
పైసా లేకుండా జీరో అకౌంట్ తెరవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఆచరణలో అమలు కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.600 ఖర్చుపెడితేనే బ్యాంక్ అకౌంట్ తెరవాల్సిన పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఉంటేనే ఖాతా అన్నట్లు కొన్ని బ్యాంకులు వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తున్నారు. డబ్బులు పెట్టి అకౌంట్ తెరవలేని వాళ్ల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెడితే అది పక్కదారి పడుతోందని అంటున్నారు.
సిబ్బంది లేకపోవడమే!
చాలా బ్యాంకుల్లో అనుకున్న స్థాయిలో సిబ్బంది లేకపోవటం వల్లే అవుట్‌సోర్సింగ్ పద్ధతిన జన్‌ధన్ యోజన పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సిబ్బంది లేకపోవడానికి తోడు రుణమాఫీ జాబితాల్లో మార్పులు, చేర్పులతో సిబ్బంది తలమునకలవుతున్నామని బ్యాంకర్లు అంటున్నారు. రోజుకో నిబంధనలు వస్తుండటంతో రుణమాఫీ జాబితాల తయారీతోనే బిజీబిజీగా గడపాల్సి వస్తోందని చెబుతున్నారు. అదీగాక సెప్టెంబర్ నెలాఖరులోగా త్రైమాసిక బడ్జెట్ టార్గెట్ పూర్తి చేయాల్సి ఉండటంతో సతమతమవుతున్నామనిఅంటున్నారు. రోజుకు కనీసం 100 నుంచి 150 వరకు ఒక్కొక్క బ్యాంకు ఖాతాలు తెరవాల్సిన పరిస్థితులు ఉండటంతో దానికి సరిపడా సిబ్బంది లేకపోవటం వల్లనే ఆన్‌లైన్ అవుట్‌సోర్సింగ్‌లో చేపడుతున్నట్లు తెలుస్తోంది.
పథకంతో ఉపయోగమేమిటంటే...
జన్‌ధన్ అకౌంట్ తీసుకున్న ఖాతాదారుడికి రూ.లక్ష ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఆరు నెలల తర్వాత రూ.5వేలు ఓవర్‌డ్రాప్ రూపంలో వాయిదాల పద్ధతిన చెల్లించే విధంగా వడ్డీ లేని రుణం అందుతుంది. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు నేరుగా చేరేందుకు బ్యాంకు అకౌంట్లు వినియోగించే అవకాశం ఉంది. దీంతో అకౌంట్లు లేనివాళ్లు తెరిచేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.