మోదీ మాటలకు అర్థాలే వేరయా!
న్యూఢిల్లీ: ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నెన్నో వాగ్ధానాలు చేసి ఎన్నికల బరిలోకి దిగుతాయి రాజకీయ పార్టీలు. అధికారంలోకి వచ్చాక ఆ వాగ్ధానాల గురించి ప్రజలు నిలదీస్తే తప్పించుకునేందుకు సాకులు వెతుకుతాయి. మాయమాటలు చెబుతాయి లేదా అంకెలను తారుమారుచేసి చూపుతాయి. దీనికి భారత్‌లో ఏ రాజకీయ పార్టీ , ఏ నాయకుడూ అతీతం కాదు కాదు. ఆ కోవలోకే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోది కూడా వస్తారనడానికి ఆయన మాటల తీరే అందుకు సాక్ష్యం.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మనవాళ్లు విదేశాల్లో దాచుకున్న 80 లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బును దేశంలోకి తీసుకొస్తామని, వాటిని బ్యాంకు ఖాతాలున్న దేశ పౌరుల పేరిట 15 లక్షల రూపాయల చొప్పున జమచేస్తామని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఆ హామీని నెరవేర్చలేక పోయారు.
విదేశీ చట్టాలు మనకు అనుకూలంగా లేవని అందుకనే హామీని నెరవేర్చలేక పోతున్నామని, ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. దేశంలోకి నల్లడబ్బును తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామంటూ గత మే నెలలో నల్లడబ్బుపై కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం మూడు నెలలోనే 6,500 కోట్ల రూపాయల నల్లడబ్బును వసూలు చేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15వ తేదీ దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రజాముఖంగా ప్రకటించారు. ఆయన ప్రకటించాక కూడా నెలన్నర రోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకు 638 ఫైలింగ్స్ ద్వారా నల్లడబ్బు 3,770 కోట్ల రూపాయలు వసూలయ్యాయని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొన్న అధికారికంగా ప్రకటించారు.
ఆగస్టు 15వ తేదీ నాటికే 6,500 కోట్ల రూపాయల నల్లడబ్బు వసూలైనట్లు నరేంద్ర మోదీ ప్రకటించగా, ఇప్పుడు ఆ సొమ్ము ఎలా తగ్గిపోయిందని మీడియా ప్రశ్నిస్తే, దానికి ఆయన నుంచి సమాధానం రాలేదు. మోదీ ఉద్వేగపూరితంగా మాట్లాడుతూ 6,500 కోట్ల రూపాయలని ఉజ్జాయింపుగా అన్నారని, వాస్తవానికి నల్లడబ్బుకు సంబంధించిన లెక్కలు ఆయనకు తెలియవని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమాధానం ఇచ్చారు.
మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు వసూలైన 3,770 కోట్ల రూపాయలను దేశ పౌరుల ఖాతాలో జమచేసినట్టయితే ఒక్కొక్కరికి 18.68 రూపాయలు వస్తాయి. ఇంకాస్త నల్లడబ్బు వసూలయ్యే వరకు ఆగుదామా, వచ్చినకాడికి చాలనుకొని వచ్చిందే జమ చేయమందా.