‘ధన జన’పై బ్యాంకుల ఆసక్తి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రైవేటు బ్యాంకులు ప్రధానమంత్రి జన ధన యోజన పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడానికి ప్రైవేటు బ్యాంకులు ముందుకొస్తున్నాయి.
అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన జన ధన యోజన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నట్లు దేశీయ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐతో పాటు డీసీబీ బ్యాంక్, యాక్సిస్, ఫెడరల్ బ్యాంకులు ప్రకటించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ పథకం కింద 25 లక్షల ఖాతాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తెలిపారు.
తమ 3700 శాఖల నెట్‌వర్క్‌లో ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినప్పటికీ గ్రామీణ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్న డీసీబీ బ్యాంక్ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించినట్లు డీసీబీ బ్యాంక్ అగ్రి, ఇంక్లూజివ్ బ్యాంక్ హెడ్ నరేంద్రనాథ్ మిశ్రా తెలిపారు. ఈ పథకం ప్రారంభిస్తున్న గురువారం ఒక్క రోజులో దేశ వ్యాప్తంగా కోటి ఖాతాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా కోటిన్నర ఖాతాలను తెరవడం విశేషం.
ప్రభుత్వం రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతోనే ఈ విజయం సాధ్యమైందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మాకు 2.5 లక్షల ఖాతాలను తెరిపించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించగా, ఏకంగా 4.7 లక్షల ఖాతాలను ప్రారంభించామని, ఇందులో ప్రైవేటు బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాయని తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్, ఎస్‌బీహెచ్ ఎండి శంతను ముఖర్జీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మార్కెట్లోకి వేగంగా చొచ్చుకు వెళ్ళగలుగుతున్నామని, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 15,600 గ్రామాల్లోకి ప్రవేశించ గలిగినట్లు ఐసీఐసీఐ తెలిపింది. ఈ ఒక్క రోజులోనే 3.62 లక్షల ఖాతాలను తెరిచినట్లు ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. ఎస్‌బీఐ స్పాన్సర్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 90,773 ఖాతాలను ప్రారంభించినట్లు ఆ బ్యాంక్ చైర్మన్ వి.నర్సిరెడ్డి పేర్కొన్నారు.
బీమా కంపెనీలు కూడా..
ఈ కార్యక్రమంలో ప్రైవేటు బ్యాంకులే కాకుండా ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ముందుకు రావడం విశేషం. జన ధన యోజన పథకం కింద ఖాతాదారునికి అందిస్తున్న ఉచిత బీమా రక్షణను కల్పించడానికి ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ముందుకొచ్చింది. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఫైనాన్సియల్ సంస్థలు ముందుకొస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యాలను నిర్దేశిత కాలానికంటే ముందే చేరుకోగలమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.