‘జన్ ధన్’ ఉంటే ఉచిత సిమ్
- వినియోగదారులకు మెరుగైన సేవలు
- 3 జీ సేవలు మరింత విస్తృతం
- బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం మహంతి
శ్రీకాకుళం అర్బన్: ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఎప్పటికప్పుడు నూతన పోకడలతో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ హెచ్.సీ.మహంతి అన్నారు. శ్రీకాకుళంలోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజన పథకం కింద రూ.20 విలువ చేసే ప్రీ-పెయిడ్ సిమ్‌ను ఉచి తంగా అందజేస్తున్నామన్నారు. సిమ్‌ను పొందగోరేవారు తమ ఫొటోతోపాటు జన్‌ధన్ యోజన బ్యాంకు ఖాతా ప్రతులను సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ పథకంతో లబ్ధిదారులందరికీ బ్యాంకు ఖాతాతోపాటు సెల్‌ఫోన్ కనెక్షన్ ఉంటుందన్నారు.
తమ సంస్థ అత్యుత్తమ ఆఫర్లను ప్రవేశపెట్టిందని.. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూ. 100 నుంచి రూ. 1000 వరకూ ఫుల్‌టాక్‌టైమ్, రూ. 1010 నుంచి రూ. 2,990 వరకు 10 శాతం అదనపు టాక్‌టైమ్‌తో ప్యాకేజీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఆఫర్ ఈనెల 22వ తేదీ వరకు మాత్రమే ఉంటుందన్నారు. అలాగే కొత్త కూంబో ఎస్‌టీవీ ప్లాన్ కింద రూ. 111లకు రూ. 90 టాక్‌టైమ్‌తోపాటు 70 నిమిషాల ఇంటర్‌నెట్ సదుపాయం ఉంటుందన్నారు. రూ. 222 ప్లాన్‌లో రూ.190 టాక్‌టైమ్‌తోపాటు రూ. 110 నిమిషాల ఇంటర్‌నెట్ సదుపాయాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగించుకునే వినియోగదారులకు కూడా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.
బీబీహోమ్ యూఎల్ రూ. 525 పథకాన్ని మార్పుచేసి బీబీహోమ్ యూఎల్ రూ.545 పథకం కింద 512 కేబీపీఎస్ నెల మొత్తంగా వర్తించే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3.50 లక్షలు మంది బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఉన్నారని..వీరికి మెరుగైన సేవలు అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 203 2జీ సెల్‌టవర్లు ఏర్పాటు చేశామని..అలాగే 3జీ సెల్‌టవర్లు 63 ఉన్నాయన్నారు. మరింత మెరుగైన సిగ్నల్స్ కోసం పురుషొత్తపురం, తామరాపల్లి గ్రామాల్లో త్వరలో సెల్‌టవర్లు నిర్మించనున్నామన్నారు.
నరసన్నపేట, టెక్కలి, పాతపట్నంలతోపాటు పాలకొండకు కూడా 3జీ సెల్ సర్వీస్ ఏర్పాటు చేయబడ్డాయని, శ్రీకాకుళం పట్టణం, ఆమదాలవలస, సోంపేటలకు 3జీ సేవలను మరింతగా విస్తృత పరిచామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 17 కొత్త సెల్‌టవర్లు ప్రారంభించామన్నారు. పలాస పరిధిలో ఫ్రాంచేజీ కోసం ఓపెన్‌బిడ్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి, సంతబొమ్మాళి మండలాలు దీని పరిధిలో ఉన్నాయన్నారు. ఈ బిడ్‌కు ఆఖరుతేదీ ఈనెల 27వ తేదీ సాయంత్రం 3 గంటలలోగా అందజేయాలన్నారు. సమావేశం లో ఏజీఎం డి.మహేశ్వరరావు, ఏజీఎం(పరిపాలన) బీవీవీ నగేష్, సీఏవో జె.నాగరాజు, ఏఈ శైలూప్రసాద్, యూనియన్ నాయకులు డి.వెంకటేశ్వరరావు, బి.జగన్నాథం పాల్గొన్నారు.