విజయనగరం కంటోన్మెంట్: జన్‌ధన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంకు అకౌంట్లు ఉండాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి బ్యాంకు అకౌంట్లు తక్షణమే తెరిపించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన తహశీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సహకరించని బ్యాంకర్ల వివరాలు తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. మొదటి దశ రుణమాఫీ కార్యక్రమం కింద లబ్ధిపొందని రైతుల ఫిర్యాదులను పరిష్కరించి అప్‌లోడ్ చేయాలన్నారు. వేరే మండలానికి చెందిన ఫిర్యాదులను ఆయా మండలాలకు పంపించి పరిష్కరించాలని సూచించారు. రెండో దశకు అర్హులైన వారి వివరాలను త్వరితంగా అప్‌లోడ్ చేయాలన్నారు.
రైతులకు అందజేస్తున్న ఈ పాస్ పుస్తకాలు వెయ్యి వరకూ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన అందజేయాలన్నారు.వయోజన విద్యా కేంద్రాల్లో చదువుతున్న వారికి మార్చి 15వ తేదీన పరీక్ష జరగనుందని, ఈ పరీక్షకు అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ఇన్విజిలేటర్ల నియామకం, వసతుల ఏర్పాటు వంటి ప్రక్రియలు చేపట్టామని తెలిపారు. గతసారి హాజరు కానివారు, హాజరై పరీక్షలో ఫెయిల్ అయిన వారు మాత్రమే ఈ పరీక్షకు హాజరు కావాలని స్పష్టం చేశారు. సాక్షరభారత్ 5వ ఫేజ్ కింద జనవరి1వ తేదీనుంచి తరగతులు ప్రారంభమయ్యాయని, వారికి 6 నెలల తరువాత పరీక్ష నిర్వహిస్తారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ జి.రాజకుమారి, ఆర్డీఓ జె. వెంకటరావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ గాయత్రీ దేవి, డ్వామా ఏపీడీ అప్పలనాయుడు, వయోజన విద్యా ఉప సంచాలకులు ఎం.అమ్మాజీరావు, మండలాల నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంకు అకౌంట్లుండాలి
Published Wed, Feb 4 2015 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement