
సాక్షి, హైదరాబాద్: జన్ ధన్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయాన్ని వారి చెంతనే పంపిణీ చేసేలా బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా నగదు ఉపసంహరణకు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా గ్రామాల్లో సింగిల్ టేబుల్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని నేరుగా ఖాతాలో జమచేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 2 నుంచి నగదు జమ చేస్తోంది. ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో నిర్దేశిత పద్దతిలో ఈ నగదును జమ చేస్తుండగా... నిర్దేశిత తేదీల్లో ఆయా ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే 50శాతం ఖాతాల్లో నగదు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
సులభంగా... వేగంగా...
జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్రం నిర్దేశిత తేదీలు ప్రకటించింది. ఈనెల 10వ తేదీ నుంచి విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుం డా నేరుగా గ్రామంలోనే నగదును విత్‌డ్రా చేసుకునే వీలు కల్పిస్తోంది. బ్యాంకు మిత్ర, బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా బ్యాంకు శాఖ సర్వీస్ ఏరియాలోని ప్రతి గ్రామంలో సింగిల్ టేబుల్ కౌంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఎస్‌ఎల్‌బీసీ సూచించిన విధంగా నగదు చెల్లింపులు చేపట్టనున్నాయి. రెండ్రోజులుగా కొ న్ని బ్యాంకులు ప్రయోగాత్మకంగా చెల్లింపులు ప్రారంభించగా... మిగతా బ్యాంకులన్నీ మరో రెండ్రోజుల్లో ఈ సింగిల్ టేబుల్ కౌంటర్లు ఏర్పా టు చేసేందుకు చర్యలు వేగవంతం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment