డెబిట్ కార్డు వినియోగం కంటే.. క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగిపోయింది. వేల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగుల దగ్గర నుంచి లక్షల శాలరీ తీసుకునే ఉద్యోగుల వరకు, అందరూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. అవసరానికి క్రెడిట్ కార్డును వాడుకోవడం మంచిదే.. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. ఈ స్కోర్ పెంచుకోవడానికి ఐదు ఉత్తమ మార్గాలను ఈ కథనంలో చూసేద్దాం..
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు.
సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.
సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఐదు మార్గాలు
➤క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.
➤లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుంది.
➤మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.
➤క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.
➤సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment