రేపటి నుంచి మార్కెట్లు మూడు రోజులపాటు పనిచేయని కారణంగా గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ కౌంటర్ నేటి నుంచి ఎక్స్‌స్ల్పిట్‌గా ట్రేడవుతోంది. కంపెనీ రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించింది. ఇతర వివరాలు చూద్దాం..
జీఏఈఎల్
షేర్ల విభజనకు అక్టోబర్ 5 రికార్డ్ డేట్ కావడంతో గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్(జీఏఈఎల్) కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 20 శాతం దూసుకెళ్లి రూ. 128ను తాకింది. ఆపై కొంత వెనకడుగుతో రూ. 122 వద్ద ట్రేడవుతోంది. ఇది 12 శాతం లాభంకాగా.. బుధవారం ముగింపు రూ. 218తో పోలిస్తే.. రూ. 110 దిగువన ప్రారంభమైంది. మార్కెట్లకు మూడు రోజులు సెలవులు కావడంతో నేటి(గురువారం) నుంచి ఎక్స్‌స్ల్పిట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైనట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఎన్‌ఎఫ్‌సీఎల్
ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో నాగార్జునా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఎన్‌ఎఫ్‌సీఎల్) రూ. 85.3 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 113 కోట్ల నష్టం నమోదైంది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ క్యూ1(ఏప్రిల్-జూన్)లో మొత్తం ఆదాయం రూ. 347 కోట్ల నుంచి రూ. 464 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌ఎఫ్‌సీఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 4.35 వద్ద ఫ్రీజయ్యింది.
సింటెక్స్ ఇండస్ట్రీస్
సింటెక్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రుణ ఖాతాలలో రూ. 1,203 కోట్లమేర మోసాలు జరిగినట్లు ఆర్‌బీఐకి పీఎస్‌యూ సంస్థ పంజాజ్ నేషనల్ బ్యాంక్ నివేదించింది. ఈ రుణాలు ఎన్‌పీఏలుకాగా.. ఇప్పటికే ఈ ఖాతా కింద రూ. 215 కోట్లకు ప్రొవిజన్లు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సింటెక్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. కొనుగోలుదారులు లేకపోవడంతో రూ. 2 వద్ద ఫ్రీజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment