విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కీలకమని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ 'గ్యారెత్ ఓవెన్' అన్నారు. విశాఖలో ఈ సమ్మిట్ జరగడం చాలా మంచి పరిణామమని తెలిపారు. తీరప్రాంతం ఎప్పుడూ పెట్టుబడులకు అనుకూల ప్రదేశమని సాక్షి ప్రతినిధులతో అన్నారు.
మీ వైజాగ్ పర్యటనకు కారణాలు...
తెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్ ప్రతినిధిగా ఇక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో రెండు సార్లు విజయవాడలో పర్యటించాను. దీనిలో భాగంగా తొలిసారి వైజాగ్ వచ్చాను. ఇక్కడ ఉన్న మౌళిక వసతులు, వ్యాపార అవకాశాలను పరిశీలించడానికి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి బ్రిటన్ ఎలాంటి వ్యాపారాలు చేయవచ్చో అధ్యయనం చేసేందుకు వచ్చాను.
వైజాగ్ ఎలా అనిపించింది... ఇక్కడ మీకు నచ్చిన అంశాలు ఏంటి?
విశాఖపట్టణం అద్భుతమైన నగరం. ఇక్కడి తీరప్రాంతం ఎంతో నచ్చింది. ఇక్కడి వాతావరణం, ప్రజలు నాకు చాలా నచ్చారు. ఒక్కసారే వచ్చినప్పటికీ ఎప్పటి నుంచో ఇక్కడే నివాసం ఉంటున్నట్లు అనిపించింది. వ్యాపార పరంగా ఎంతో అవకాశాలు ఉన్న నగరం విశాఖపట్టణం. చాలా మంది ఇక్కడి వ్యాపారస్థులు బ్రిటన్‌తో వ్యాపార సంబంధాలు పెంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
పారిశ్రామికంగా, ఐటి హబ్‌గా విశాఖపట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. విశాఖ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా?
అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయి. మారిటైం బోర్డ్‌తో చాలా విషయాలపై చర్చించాను. తీరప్రాంత అభివృద్ధికి వారు చాలా ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాఖపట్నంలో త్వరలో ప్రారంభమయ్యే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వేదికను ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఇప్పటికే చాలా మంది వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ సమ్మిట్‌కు సంబంధించి మీ దృష్టి ప్రధానంగా ఏయే రంగాలపై ఉండబోతోంది?
మొదట మేము ప్రధానంగా తీరప్రాంత వ్యాపార అభివృద్ధిపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నాము. తీర ప్రాంతంలో వ్యాపారం చేసేందుకు కంపెనీలు ఉత్సాహంగా ఉంటాయి. రెండవ ప్రధాన అంశం... నైపుణ్యం ఉన్న మానవవనరులు వ్యాపార రంగానికి ఎంతో ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో టాలెంట్ ఉంది. నేను విశాఖపట్నంలో మెడ్‌టెక్ జోన్‌కు వెళ్లాను... అక్కడ నైపుణ్య అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నారు. చాలామంది విశాఖకు చెందినవారే మెడ్‌టెక్ జోన్‌ను నడిపిస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ టాలెంట్ అంతా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండి ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేసి ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయగలరు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగిన మీరు విశాఖ నగరాన్ని ఎలా చూస్తారు. అందరు అంటున్నట్టు వైజాగ్ ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగే అవకాశముందా?
అభివృద్ధికి కావాల్సిన అన్ని హంగులు, అర్హతలు విశాఖపట్టణానికి ఉన్నాయి. తీరప్రాంతంలో ఉండటం విశాఖకు ఎంతో ప్లస్ పాయింట్. సహజమైన మౌళిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన మానవవనరులు విశాఖ అభివృద్దికి కీలకం కాబోతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది విశాఖపట్నంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అద్భుతమైన అవకాశం. ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ విదేశీ పెట్టుబడులకు సిద్ధంగా ఉందనే విషయం అందరికి తెలుస్తుంది.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా విశాఖపట్టణానికి మేలు జరగనుంది
గ్లోబర్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణం వ్యాపార రంగంలో చర్చకు కేంద్రబిందువుగా ఉంటాయి. పెట్టుబడుల పరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ సమ్మిట్ ద్వారా గుర్తింపు వస్తుంది. ఇన్వెస్టర్ సమ్మిట్‌లో కార్పోరేట్ సంస్థలు ప్రభుత్వం మధ్య జరిగే చర్చల ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయి. విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలపై సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉంది. నా వైజాగ్ పర్యటనలో పెట్టుబడి అవకాశాలపై మారిటైమ్ సంస్థ ఇచ్చిన ప్రెజంటేషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. మారిటైమ్ బోర్డ్ ద్వారా సముద్రతీరంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయి. దేశ, విదేశీ వ్యాపార సంస్థలు ఆంధ్రప్రదేశ్ గురించి మరింత ఎక్కువగా తెలుసుకోడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను.
తీర ప్రాంతం ఏవిధంగా వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది
చారిత్రకంగా చూస్తే సముద్రతీర ప్రాంతం వ్యాపారానికి ఎంతో అనువైనది. భారతదేశం ఎన్నో దేశాలకు వ్యాపార పరంగా గేట్‌వే ఉంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలాంటి దేశాలతో వ్యాపారానికి భారత తీరప్రాంతమే ముఖద్వారం. పరిశ్రమలు ఉత్పత్తులను వెంటనే విదేశాలకు కంటైనర్‌లలో పంపించడానికి వీలుగా తీరప్రాంతాలలోనే తమ ప్లాంట్ల పెడుతున్నాయి.
మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు... ఆయనతో ఏ అంశాలపై చర్చించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో దార్శనికత ఉన్న నాయకులు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో ఎంతో ఫలప్రదమైన సంభాషణ జరిగింది. పాలనలో ఆయన తన ప్రాధాన్యతలైన విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల గురించి ఎంతో సుదీర్ఘంగా చర్చించారు. ఇతర మంత్రులతో జరిగిన చర్చలు కూడా ఎంతో సంతృప్తినిచ్చాయి. గతంలో చాలామంది ఆర్బీకేలను సందర్శించమని నాకు సూచించారు. కేవలం పదినిమిషాల పాటు చూద్దామని రైతుభరోసా కేంద్రానికి వెళ్లిన నేను అక్కడ దాదాపు మూడు గంటలు గడిపాను. ఆర్బీకేలు రైతులకు ఎంతో ఉపయోగకరమైనవి. రాష్ట్రప్రభుత్వం రైతులకు మద్దతుగా చేస్తున్న ప్రయత్నాలు చూసి నేను అబ్బురపడ్డాను.
విద్యా, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేపట్టిన మార్పులపై మీ అభిప్రాయం....
అద్భుతం... విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి పరిచేందుకు ఏపీ ప్రబుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో గొప్పవి. ఏపీలో
పెద్ద ఎత్తున ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించాలనే ముఖ్యమంత్రి ఆలోచన ఎంతో మంచిది.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏ రంగాలకు ప్రాధాన్యం పెరగనుంది
ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ప్రతినిధులు వ్యాపార అవకాశాలతో పాటు ఏపీలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెడతారు. ఆంద్రప్రదేశ్ తీరప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలు మీకు నచ్చాయా... ఇక్కడి ఆహరం, అలవాట్లు ఎలా ఉన్నాయి?
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నరెండు తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ ప్రతినిథిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడి వాతావారణం అద్భుతం. భోజనం కొంత స్పైసీగా ఉన్నా... పరవాలేదు. ఒకసారి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇచ్చిన ఆతిథ్యం మరీ స్పైసీగా ఉండింది. ఇక ఇక్కడి ప్రజలు అద్భుతమైన వారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటిష్ సంస్థల పెట్టుబడులు వచ్చేవిధంగా నా ప్రయత్నాలు చేస్తాను. రెండు ప్రాంతాల మధ్య మరింత బలమైన సామాజిక, ఆర్ధిక సంబంధాలకు నా శాయశక్తులా కృషి చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment