సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల తీరు నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారైంది. దలాల్ స్ట్రీట్‌లో అదానీ స్టాక్‌ల తనం కారణంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ సంపద దాదాపు సగం ఆవిరైపోయింది. ప్రస్తుతం ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రస్తుతం అదానీ నికర విలువ 55.8 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతమ్ అదానీకి చెందిన ఎనర్జీ-టు-పోర్ట్‌ల సామ్రాజ్యం నికర సంపద 10 రోజుల్లో సగం తుడిచి పెట్టుకు పోయింది. ఫలితంగా ప్రపంచంలో 2వ అత్యంత సంపన్న పౌరుడిగా ఎదిగిన బిలియనీర్ 108 బిలియన్ డాలర్లను కోల్పోయి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు.
ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 20వేల ఎఫ్‌పీవో రద్దు భారీ క్షీణతకు దారితీసింది. అటు హిండెన్‌బర్గ్ కంపెనీకి అదానీ గ్రూపు ఇచ్చిన సమాధానం కూడా పెట్టుబడి దారులకు భరోసా ఇవ్వడంలో విఫలమైంది. ఫలితంగా అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ , అదానీ గ్రీన్ ఎనర్జీ వాటి గరిష్ట స్థాయిల నుండి 70-75 శాతం క్షీణించగా, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ విల్మార్ తమ విలువలో 50-60 శాతం నష్టపోయాయి. ఇంకా ఏసీసీ అంబుజా సిమెంట్స్ ,ఎన్‌డీటీవీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి.
డౌ జోన్స్ నుంచి ఔట్
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ నుండి తొలగించనున్నారు. ఈమేరకు S&P Dow Jones Indices ఒక నోట్ జారీ చేసింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం ఆరోపణలు, మీడియా, వాటాదారుల విశ్లేషణ తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ సూచీల నుండి తొలగిస్తున్నట్టు ఈ నోట్ పేర్కొంది. ఈ సంక్షోభంతో ప్రపంచవృద్ధి ఇంజిన్‌గా, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గమ్య స్థానంగా ఉన్న భారత విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
అదానీ గ్రూపు మేనేజ్‌మెంట్ క్లారిటీ కోరనున్న ఎల్‌ఐసీ
మరోవైపు అదానీలో కీలక పెట్టుబడిదారు ఎల్‌ఐసీ త్వరలోనే అదానీ గ్రూపు కీలక మేనేజ్‌మెంట్‌తో భేటీ కానుందట. ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఇన్వెస్టర్లకు పెట్టుబడులను తిరిగి ఇచ్చే విషయంలో స్పష్టకోరనుందని సీఎన్‌బీసీ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment