
కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న పుత్తడి, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ, ఇటు ఎంసీఎక్స్‌లోనూ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం..
ప్లస్‌లో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 58 లాభపడి రూ. 51,460 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 287 పెరిగి రూ. 68,730 వద్ద కదులుతోంది.
మూడో రోజు మిశ్రమం
ఎంసీఎక్స్‌లో వరుసగా మూడో రోజు బుధవారం పసిడి బలపడింది. అయితే ఊగిసలాట మధ్య వెండి నామమాత్రంగా వెనకడుగు వేసింది. 10 గ్రాముల పుత్తడి స్వల్పంగా రూ. 49 పెరిగి రూ. 51,402 వద్ద ముగిసింది. తొలుత 51,480 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,872 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 51 తగ్గి రూ. 68,443 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,532 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,288 వరకూ క్షీణించింది. కాగా.. పసిడి, వెండి ధరల నాలుగు రోజుల నష్టాలకు సోమవారం చెక్ పడిన విషయం విదితమే.
కామెక్స్‌లో
న్యూయార్క్ కామెక్స్‌లో బుధవారం చివర్లో బలపడిన బంగారం, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లుగా కదులుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,955 డాలర్లకు చేరింది. స్పాట్ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1947 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి మాత్రం ఔన్స్ 0.5 శాతం పుంజుకుని 27.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బుధవారం తొలుత పసిడి, వెండి ధరలు క్షీణించినప్పటికీ చివర్లో పుంజుకోవడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment