
దేశీ మార్కెట్లో ముందురోజు లాభపడిన బంగారం, వెండి ధరలు మళ్లీ నీరసించాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 112 క్షీణించి రూ. 50,575 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 145 నష్టంతో రూ. 61,950 వద్ద కదులుతోంది.
ప్యాకేజీపై డౌట్‌తో
కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీపై కాంగ్రెస్‌లో సందిగ్ధత కొనసాగుతుండటంతో సోమవారం పసిడి, వెండి బలపడ్డాయి. అధ్యక్ష ఎన్నికల్లోపు ప్యాకేజీని అమలు చేయాలంటే మంగళవారంలోగా ప్యాకేజీపై ఒప్పందం కుదుర్చుకోవలసి ఉన్నట్లు పెలోసీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో చేపట్టిన చర్చలపై మంగళవారానికల్లా స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో సోమవారం పసిడికి డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. సంక్షోభ సమయాలలో రక్షణాత్మక పెట్టుబడిగా పసిడిని భావించే సంగతి తెలిసిందే.
సోమవారమిలా
ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల పసిడి రూ. 123 పెరిగి రూ. 50,670 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,940 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,437 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 373 లాభపడి రూ. 62,049 వద్ద నిలిచింది. ఒక దశలో 63,280 వరకూ బలపడన వెండి తదుపరి రూ. 61,177 వరకూ క్షీణించింది.
కామెక్స్‌లో..
న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.4 శాతం క్షీణించి 1,904 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో స్వల్ప నష్టంతో 1,902 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి 0.6 శాతం కోల్పోయి ఔన్స్ 24.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.