న్యూయార్క్/ ముంబై: ముందురోజు వాటిల్లిన నష్టాల నుంచి పసిడి, వెండి కోలుకున్నాయి. ప్రస్తుతం అటు న్యూయార్క్ కామెక్స్, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో లాభాలతో ట్రేడవుతున్నాయి. సెకండ్ వేవ్‌లో భాగంగా కోవిడ్-19 విజృంభిస్తుండటంతో అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండున్నరేళ్ల కనిష్టం 90.62కు చేరింది. దీంతో తాజాగా పసిడికి బలమొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే యూకే, కెనడా, యూఎస్ తదితర దేశాలలో వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకావడంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశంలేదని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్ వివరాలు ఇలా..
సానుకూలంగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 285 పుంజుకుని రూ. 49,224 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 49,260 వద్ద గరిష్టాన్నీ, ఆపై రూ. 49,007 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ సైతం రూ. 429 వృద్ధితో రూ. 63,900 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 64,026 వద్ద గరిష్టానికీ, రూ. 63,599 వద్ద కనిష్టానికీ చేరింది.
హుషారుగా..
న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 0.6 లాభంతో 1,843 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.65 శాతం బలపడి 1,839 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.7 శాతం ఎగసి 24.22 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు.
Comments
Please login to add a commentAdd a comment