న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్.. న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్చేంజ్ (నైమెక్స్)లో మళ్లీ పసిడి మెరుస్తోంది. ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం కీలకమైన 1,900 డాలర్లు దాటింది. ఒకదశలో 1,913 డాలర్లకుపైగా ఎగసింది. గడచిన 20 వారాల్లో పసిడి కీలక నిరోధం 1,900 డాలర్లను అధిగమించడం ఇదే తొలిసారి. 1,913 డాలర్ల నిరోధాన్ని అధిగమించి, స్థిరపడితే తిరిగి గరిష్టాల దిశగా బంగారం దూసుకుపోయే అవకాశం ఉందన్నది విశ్లేషణ.
కారణం ఏంటి..: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు తలెత్తాయి. అయినప్పటికీ సరళతర ఆర్థిక విధానాలకే (ప్రస్తుత ఫెడ్ ఫండ్‌రేటు 0.00 శాతం–0.25 శాతం) కట్టుబడి ఉన్నట్లు ఫెడరల్ రిజర్వ్ అధికారులు స్పష్టం చేశారు. దీనితో ఆరు దేశాల కరెన్సీల ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93 గరిష్ట స్థాయిల నుంచి తాజాగా 89.80 కనిష్టానికి (4 నెలల కనిష్టం) పడిపోయింది.
ఇది పసిడి ధర పెరుగుదలకు దారితీసింది. సరళతర ఆర్థిక పరిస్థితులు ఒకవైపు, ఆర్థిక పరిస్థితిపై అనిశ్చితి మరోవైపు నేపథ్యంలో తిరిగి ఇన్వెస్టర్ పసిడిని తన పెట్టుబడులకు తక్షణ రక్షణ కవచంగా ఎంచుకున్నట్లు విశ్లేషణ. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,673 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,107 డాలర్లు.
దేశీయంగా చూస్తే...: అంతర్జాతీయంగా పసిడి చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉన్నప్పుడు దేశీయంగా ధర 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.56,000 పలికింది. 1,640 డాలర్ల స్థాయికి పడిపోయినప్పుడు కొంచెం అటుఇటుగా రూ.45,000 వద్దకు చేరింది. బుధవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర దాదాపు రూ.200 లాభంతో రూ.49,000 పైకి ఎగసింది.
దేశీయ ధరపై అంతర్జాతీయ ఎఫెక్ట్
అంతర్జాతీయంగా ధరల పెరుగుదల దేశీయ యల్లో మెటల్‌పై ప్రభావం చూపుతోంది. దీనితో దేశంలో ధర 4 నెలల కనిష్టానికి చేరింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పడిపోవడం, డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణి, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఫెడ్ భయాలు, దీనికితోడు భారత్‌సహా పలు దేశాల్లో కరోనా సెకండ్‌వేవ్ సవాళ్లు పసిడి ధర పెరుగుదలకు దారితీశాయి.
–నిష్ భట్, సీఈఓ, మిల్‌ఉడ్ కేన్ ఇంటర్నేషనల్
చదవండి: స్విగ్గీ.. జొమాటోకు షాక్.!
Comments
Please login to add a commentAdd a comment