
ముంబై : వారం రోజులుగా దిగివస్తున్న పసిడి ధరల పతనానికి బ్రేక్ పడింది. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 పెనుప్రభావం చూపుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎగిశాయి. దేశీ మార్కెట్‌లోనూ శుక్రవారం పసిడి ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 300 రూపాయలు భారమై 51,195 రూపాయలు పలికింది. కిలో వెండి 746 రూపాయలు పెరిగి 65,936 రూపాయలకు చేరింది. ఈనెల 7న బంగారం ధర రికార్డు స్ధాయిలో 56,200 రూపాయలకు పెరిగిన అనంతరం పసిడి ధరలు ఏకంగా 5000 రూపాయల వరకూ దిగివచ్చాయి.
వరుస పతనాల అనంతరం బంగారం ధరలు స్వల్పంగా ఎగబాకాయి. కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రతికూల ప్రభావం ఉంటుందనే అంచనాలతో పాటు అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాలకు గతవారం పదిలక్షల మందికి పైగా అమెరికన్లు దరఖాస్తు చేయడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై సందేహాలు పెంచింది. ఈ పరిణామాలతో పసిడిలో మదుపు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు.