
ఇటీవల చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. వరుసగా ఆటుపోట్లను చవిచూస్తున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ.. ముందు రోజు నష్టాలకు చెక్ పెడుతూ లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 129 పెరిగి రూ. 51,398వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 471 ఎగసి రూ. 66,040 వద్ద కదులుతోంది.
సోమవారమిలా
ఎంసీఎక్స్‌లో'సోమవారం 10 గ్రాముల పసిడి రూ. 747 పతనమై రూ. 51,269 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52,232 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,160 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,498 కోల్పోయి రూ. 65,569 వద్ద నిలిచింది. ఒక దశలో 67,345 వరకూ జంప్‌చేసిన వెండి తదుపరి రూ. 65,300 వరకూ నీరసించింది.
కామెక్స్‌లో ఫ్లాట్‌గా..
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 0.1 శాతం బలపడి 1,942 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.3 శాతం పుంజుకుని 1,935 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 0.7 శాతం ఎగసి 27 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది.