
రెండు రోజుల వరుస నష్టాల నుంచి పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. సావరిన్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ తదితర సంస్థలు బంగారం, వెండిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ధరలు తాజాగా తలెత్తి చూస్తున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో కదులుతున్నాయి. రెండు రోజుల ర్యాలీకి మంగళవారం చివర్లో బ్రేక్ పడగా.. బుధవారం సైతం అమ్మకాలదే పైచేయిగా నిలవడంతో డీలా పడిన సంగతి తెలిసిందే.
లాభాలతో షురూ..
ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి.. ధరలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 94 పెరిగి రూ. 50,915 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 203 ఎగసి రూ. 65,987 వద్ద కదులుతోంది.
వెండి వీక్
బుధవారం వరుసగా రెండో రోజు పసిడి ధరలు వెనకడుగు వేశాయి. వెండి సైతం డీలా పడింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 681 క్షీణించి రూ. 50,821 వద్ద ముగిసింది. తొలుత 51,555 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,696 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 2,565 పడిపోయి రూ. 65,784 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 67,888 వరకూ బలపడిన వెండి ఒక దశలో రూ. 65,650 వరకూ వెనకడుగు వేసింది.
కామెక్స్‌లో ప్లస్..
విదేశీ మార్కెట్లో గత రెండు రోజుల పతనానికి చెక్ పెడుతూ పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 1,956 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.35 శాతం లాభంతో 1950 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి మరింత అధికంగా ఔన్స్ 1.6 శాతం జంప్‌చేసి 27.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు రెండు రోజులు బలపడితే.. రెండు రోజులు క్షీణిస్తున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment