
ప్రయివేట్ బ్యాంకింగ్ రంగంలోని అతిపెద్ద సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సీఈవోగా శశిధర్ జగదీశన్ ఎంపికయ్యారు. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఆమోదముద్ర వేసింది. 25ఏళ్లుగా బ్యాంక్‌కు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ పురోభివృద్ధి పథంలో నిలిపిన ప్రస్తుత సీఈవో ఆదిత్య పురీ ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎంపిక కమిటీ ప్రతిపాదించిన ముగ్గురు అధికారుల్లో శశిధర్‌కే ఆర్‌బీఐ ఓటు వేసింది. దీంతో కొద్ది రోజులుగా బ్యాంకింగ్ వర్గాలు అత్యంత ఆసక్తితో ఎదురుచూసిన అంశానికి తెరపడింది. ప్రస్తుత కోవిడ్-19 సవాళ్లు, దేశీ బ్యాంకింగ్ రంగంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రముఖ పాత్ర పోషిస్తుండటం, యస్ బ్యాంక్ వైఫల్యం వంటి అంశాల నేపథ్యంలో ఆర్‌బీఐ సైతం సీఈవో ఎంపికలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇందువల్లనే ఎంపిక నిర్ణయం ఆలస్యమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. శశిధర్ పదవీకాలం మూడేళ్లపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
సొంత సిబ్బంది నుంచే
ఆదిత్య పురీ బాటలో శశిధర్ జగదీశన్ సైతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 25ఏళ్లుగా పలు బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. నిజానికి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఇతర సీనియర్లతో పోలిస్తే శశిధర్‌కు వివిధ విభాగాలలో పనిచేసిన అనుభవం అవకాశాలను పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. శశిధర్.. బ్యాంకుకు సంబంధించిన ఫైనాన్స్ గ్రూప్ హెడ్‌గా, మానవ వనరులు, లీగల్, సెక్రటేరియల్, పరిపాలన, మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లతోపాటు సీఎస్‌ఆర్ విభాగంలోనూ సేవలు అందించారు.
1996లో
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఫైనాన్స్ విభాగంలో 1996లో శశిధర్ తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 1999కల్లా ఫైనాన్స్ బిజినెస్ హెడ్‌గా ఎదిగారు. తదుపరి 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో)గా ప్రమోట్ అయ్యారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. గత 25 ఏళ్ల కాలంలో కార్యకలాపాలను భారీగా విస్తరించింది. దీంతో బ్యాంకు కార్యనిర్వాహక బాధ్యతలను సొంత సిబ్బందినుంచే ఎంపిక చేసుకోవడం మేలు చేయగలదని పురీ భావిస్తూ వచ్చారు. ఇందువల్లనే ఎంపిక కమిటీ సైతం ముగ్గురితో కూడిన ప్రతిపాదన చేసినప్పటికీ బ్యాంకులో వివిధ విభాగాలలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న శశిధర్ వైపు అధికంగా మొగ్గు చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. బాధ్యతలు స్వీకరించేందుకు రెండు నెలల గడువు మిగలడంతో పురీ నేతృత్వంలో బ్యాంక్ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా అర్ధం చేసుకుని నిర్వహించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
షేరు అప్
బ్యాంక్ కొత్త సీఈవోగా శశిధర్ ఎంపికతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు తొలుత 6 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 1061 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 1043 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment