బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కురిసిన వర్షం కారణంగా 17 విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించిన వివరాలను విమానయాన సంస్థల ద్వారా తెలుసుకోవాలని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
బెంగళూరులో గురువారం కురిసిన భారీ వర్షానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2(టీ2) వద్ద భారీగా నీరు చేరింది. టీ2 లగేజీ తీసుకునే ప్రాంతం సమీపంలో పైకప్పు నుంచి నీరు లీకవ్వడం గుర్తించారు. క్షణాల్లో వర్షం పెరగడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది.
భారీ వర్షాల కారణంగా బెంగళూరుకు రావాల్సిన విమానాలను చెన్నైకి మళ్లించారు. మొత్తం 13 దేశీయ విమానాలు, మూడు అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు, ఒక అంతర్జాతీయ కార్గో విమానాన్ని దారి మళ్లించారు. బలమైన గాలుల కారణంగా రాత్రి 9:35 నుంచి 10:30 గంటల వరకు విమానాల ల్యాండింగ్ వీలుకాలేదని ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి ఒకరు మీడియాతో తెలిపారు. ప్రయాణికులు తదుపరి సర్వీసులకు సంబంధించి విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టీ2 టెర్మినల్ నిర్మాణాన్ని రూ.5,000 కోట్లతో 2022లో పూర్తి చేశారు. అందులో జనవరి 15, 2023 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. టెర్మినల్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఇలా లీకేజీలు ఏర్పడడంపట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment