
దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్ తులం రూ.80,750 (22 క్యారెట్స్), రూ.88,090 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఈ తరుణంలో తక్కువ ధరకు బంగారం దొరికే ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కవ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.
దుబాయ్, యుఏఈ
ఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో తక్కువ ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.
థాయ్‌లాండ్
ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్‌తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్‌లాండ్‌లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.
సింగపూర్
తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్ షాపింగ్‌కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.
మలేషియా
కౌలాలంపూర్‌లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.
హాంగ్ కాంగ్
హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్‌లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఏప్రిల్ 1 నుంచి సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనల్లో మార్పులు
ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో బంగారం ధరలు అధిక ధరకు దోహదం చేసే కొన్ని కీలక అంశాలను తెలుసుకుందాం.
దిగుమతి సుంకాలు, పన్నులు: భారతదేశం బంగారంపై గణనీయమైన దిగుమతి సుంకాలు, పన్నులను విధిస్తుంది.ఈ సుంకాలు 12.5% వరకు ఉండవచ్చు. బంగారం కొనుగోళ్లపై అదనంగా 3% వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఉంటుంది. మేకింగ్ ఛార్జీలపై మరో 5 శాతం జీఎస్టీ వడ్డీస్తున్నారు.
కరెన్సీ మారకం రేట్లు: అంతర్జాతీయంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి (ఐఎన్ఆర్) బలహీనపడినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. మారకం రేట్లలో ఈ హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి .
పండుగలు, పెళ్లిళ్లు: భారతదేశంలో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, దీపావళి, ధంతేరస్, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇన్వెస్టర్లు సురక్షిత సంపదగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి పెరిగిన డిమాండ్ అధిక ధరలకు దారితీస్తుంది. ఇది భారత మార్కెట్లో ప్రతిబింబిస్తుంది.
సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు: అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత రిజర్వ్ బ్యాంక్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. ఈ బల్క్ కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్‌ను పెంచుతాయి.
Comments
Please login to add a commentAdd a comment