అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలకుగాను అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ స్పందిస్తూ కొత్తగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను వివాదంలోకి లాగింది.
సెబీ నోటీసులు అందుకున్న హిండెన్‌బర్గ్ స్పందిస్తూ..‘భారత క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. అదానీ స్టాక్స్‌పై పెట్టుబడుల్లో మేము నిబంధనల్ని పాటించలేదని అందులో ఉంది. సెబీ వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజంలేదు. అదానీ గ్రూప్ కృత్రిమంగా స్టాక్ ధరలను పెంచిందని చెప్పిన సమయంలోనే ఆయా కంపెనీల స్టాక్స్ ధరను షార్ట్ చేశామని సెబీకి ఇదివరకే స్పష్టం చేశాం. కానీ నోటీసుల్లో మాత్రం షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి వాటిపై ట్రేడ్ చేసినట్లు ఉంది. ఈ నోటీసులకు అర్థం లేదు. భారత్‌లోని శక్తిమంతమైన వ్యాపారవేత్తల లోపాలను ఎత్తిచూపితే ఇలా నోటీసులు పంపడం సరికాదు’ అని చెప్పింది.
‘అదానీ గ్రూప్ అవకతవకల వ్యవహారం భయటకు వచ్చే సమయంలో కోటక్ బ్యాంకు ఆఫ్‌షోర్ ఫండ్(విదేశాల్లో ఏర్పాటు చేసిన ఫండ్ కంపెనీ) ఏర్పాటు చేసింది. దాని సహాయంతో ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేశారు. దీనివల్ల కోటక్ బ్యాంకుకు పెద్దగా లాభాలు ఏమి రాలేదు. కానీ, సెబీ జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఎక్కడా కోటక్ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన లేదు. సెబీ మరో శక్తిమంతమైన భారత వ్యాపారవేత్తను రక్షించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది’ అని హిండెన్‌బర్గ్ తెలిపింది.
అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో నిబంధనలు పాటించామని పేర్కొంది. తన ఇన్వెస్టర్లతో ఉన్న సంబంధాలతోనే స్టాక్స్‌ను షార్ట్ చేసి 4.1 మిలియన్ డాలర్ల(రూ.34 కోట్లు) ఆదాయం పొందినట్లు తెలిపింది. అయితే సంస్థ ఖర్చులు, ఇతర వ్యయాలను లెక్కిస్తే తమకు ఏమీ మిగలలేదని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
అదానీ గ్రూప్ సంస్థల స్టాక్ ధరలను కృత్రిమంగా పెంచారని హిండెన్‌బర్గ్ తెలిపింది. అందుకోసం కంపెనీకు చెందిన కొన్ని విదేశీ పెట్టుబడిదారుల సహాయం తీసుకున్నారని చెప్పింది. ఈమేరకు 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది. విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందిందని ఆరోపించింది. ఆర్థికపరమైన నేరాలకు పాల్పడినట్లు తెలిపింది. యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని చెప్పింది. వీటిద్వారా అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఆ ఆరోపణలు వచ్చిన వెంటనే కంపెనీ స్పందించి ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించేందుకు ఎస్‌బీఐలోని అప్పులను కొంత తీర్చింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ సైతం జరిగింది.
ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..
ఇదిలాఉండగా, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ ధర మంగళవారం 3.5 శాతం మేర నష్టపోయి రూ.1,745 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment