ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 44 శాతం జంప్‌చేసి రూ. 10,636 కోట్లను తాకింది. స్టాండెలోన్ లాభం సైతం 40 శాతం ఎగసి రూ. 9,648 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం(స్టాండెలోన్) రూ. 28,337 కోట్ల నుంచి రూ. 38,763 కోట్లకు పురోగమించింది.
నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 18,227 కోట్లను తాకింది. రుణాల్లో 18 శాతం వృద్ధి సాధించగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.78 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 5,183 కోట్లయ్యింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.81 శాతం నుంచి 2.76 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 4,297 కోట్ల నుంచి రూ. 5,318 కోట్లకు పెరిగాయి. వీటిలో రిటైల్ విభాగం వాటా రూ. 5,012 కోట్లుకాగా.. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.9 శాతానికి చేరడంతో పెట్టుబడుల సమీకరణ అవసరంలేనట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment