న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 134 శాతం జంప్‌చేసి రూ. 803 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 343 కోట్లు ఆర్జించింది. నిర్వహణ లాభంలో 61 శాతం వృద్ధి(రూ. 1,342 కోట్లు) ఇందుకు దోహదం చేసింది.
ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం బ్యాంక్ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,437 కోట్లకు చేరింది. 2021–22లో రూ. 145 కోట్లు మాత్రమే ఆర్జించింది. వెరసి క్యూ4తోపాటు పూర్తి ఏడాదికి సంస్థ చరిత్రలోనే రికార్డు లాభాలను ఆర్జించినట్లు బ్యాంక్ వెల్లడించింది. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం మెరుగుపడి రూ. 3,597 కోట్లను తాకగా.. పూర్తి ఏడాదికి రూ. 9,706 కోట్ల నుంచి రూ. 12,635 కోట్లకు ఎగసింది. కాగా.. క్యూ4లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.7 శాతం నుంచి 2.51 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.53 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 16.82 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment