అత్యవసర సమయంలో రుణం కావలసినపుడు బ్యాంకులను ఆశ్రయిస్తాం. ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది ముందుగా మన సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. ఒకవేళ మన సిబిల్ స్కోర్ బాగుంటే మనకు లోన్ ఇస్తారు. లేదంటే లోన్ ఇవ్వకపోవచ్చు. దాదాపుగా ఏ బ్యాంకు అయినా ఈ సిబిల్‌స్కోర్ ఆధారంగానే లోన్ ఇస్తుంటాయి. కాబట్టి దీని గురించి అందరికీ అవగాహన ఉండాలి. సిబిల్‌స్కోర్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్
సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్‌ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్‌లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.
స్కోర్ ఎక్కువగా ఉంటే..
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి.
సిబిల్ 750-900: సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీరేటుతో పొందే అవకాశం ఉంటుంది.
సిబిల్ 700-749: స్కోర్ 700 నుంచి 749 మధ్యలో ఉంటే ఎలాంటి లోన్ అయినా పొందుతారు. కానీ ఎక్కువ వడ్డీ చెల్లించవలసి రావొచ్చు.
సిబిల్ 650-699: ఒకవేళ మీ స్కోర్ 650 నుంచి 699 మధ్యలో ఉంటే సెక్యూర్డ్ లోన్‌లు పొందగలరు. అంటే కారు లేదా ఇల్లు వంటి వాటి కోసం తీసుకునే లోన్. కానీ అన్‌సెక్యూర్డ్ లోన్ పొందలేరు. అంటే వ్యక్తిగత అవసరాల కోసం, చదువుల కోసం తీసుకునే లోన్లు, క్రెడిట్ కార్డు లోన్‌లు.
సిబిల్ 550 కంటే తక్కువ: ఒకవేళ మీ స్కోర్ 550 కన్నా తక్కువగా ఉంటే బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి అంతగా ఆసక్తిచూపవు.
సిబిల్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?
క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానికోసం సిబిల్‌కు సంబందించిన అధికారక వెబ్‌సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. ఆన్‌లైన్‌లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను ఇవ్వాలి. అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment