న్యూఢిల్లీ: ఆవిష్కరణల్లో భారత్ అంతర్జాతీయంగా మెరిసింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో ఆరు స్థానాలు మెరుగుపడి, మన దేశం 40వ స్థానానికి చేరుకుంది. ఈ వివరాలను జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీవో) ఓ నివేదికగా విడుదల చేసింది. స్విట్జర్లాండ్, యూఎస్, స్వీడన్, యూకే, నెదర్లాండ్స్ ఆవిష్కరణల పరంగా ప్రపంచంలో టాప్–5 ఆర్థిక వ్యవస్థలుగా ఈ సూచీలో నిలిచాయి. చైనా టాప్–10లో చోటు సంపాదించుకుంది.
‘‘భారత్, టర్కీ మొదటిసారి టాప్–40లోకి చేరాయి. టర్కీ 37వ స్థానాన్ని, భారత్ 40వ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. కెనడా తిరిగి 15వ స్థానంతో టాప్–15లోకి అడుగు పెట్టింది. భారత్ ఆవిష్కరణల పనితీరు సగటు కంటే ఎగువన ఉంది. ఒక్క మౌలిక రంగంలోనే సగటు కంటే తక్కువ స్కోరు సాధించింది’’అని ఈ నివేదిక తెలిపింది. 2021 ఆవిష్కరణల సూచీలో మన దేశం 46వ స్థానంలో ఉండగా, 2015లో అయితే 81 ర్యాంకుతో ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment