Global Innovation Index
-
Global Innovation Index 2023: ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు
న్యూఢిల్లీ: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తాము దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) 2023 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. మరోవైపు 2047 నాటికి సంపన్న ఎకానమీగా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు కారి్మక కొరత సమస్య కాబోదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. నవకల్పనల ప్రధాన లక్ష్యం కారి్మకుల ఉత్పాదకతను మరింతగా పెంచడం, వనరులను సమర్ధంగా వినియోగించుకునేలా చేయడమేనని ఆయన పేర్కొన్నారు. జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రూపొందించిన జీఐఐ 2023 నివేదికలోని 132 దేశాల్లో భారత్ 40వ ర్యాంకులో కొనసాగింది. అటు గత దశాబ్దకాలంగా జీఐఐలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏడు దేశాల్లో భారత్ కూడా ఒకటని జీఐఐ కో–ఎడిటర్ సషా ఉన్‡్ష–విన్సెంట్ తెలిపారు. -
ఆవిష్కరణల్లో భారత్‌కు 40వ స్థానం
న్యూఢిల్లీ: ఆవిష్కరణల్లో భారత్ అంతర్జాతీయంగా మెరిసింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో ఆరు స్థానాలు మెరుగుపడి, మన దేశం 40వ స్థానానికి చేరుకుంది. ఈ వివరాలను జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీవో) ఓ నివేదికగా విడుదల చేసింది. స్విట్జర్లాండ్, యూఎస్, స్వీడన్, యూకే, నెదర్లాండ్స్ ఆవిష్కరణల పరంగా ప్రపంచంలో టాప్–5 ఆర్థిక వ్యవస్థలుగా ఈ సూచీలో నిలిచాయి. చైనా టాప్–10లో చోటు సంపాదించుకుంది. ‘‘భారత్, టర్కీ మొదటిసారి టాప్–40లోకి చేరాయి. టర్కీ 37వ స్థానాన్ని, భారత్ 40వ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. కెనడా తిరిగి 15వ స్థానంతో టాప్–15లోకి అడుగు పెట్టింది. భారత్ ఆవిష్కరణల పనితీరు సగటు కంటే ఎగువన ఉంది. ఒక్క మౌలిక రంగంలోనే సగటు కంటే తక్కువ స్కోరు సాధించింది’’అని ఈ నివేదిక తెలిపింది. 2021 ఆవిష్కరణల సూచీలో మన దేశం 46వ స్థానంలో ఉండగా, 2015లో అయితే 81 ర్యాంకుతో ఉండడం గమనార్హం. -
ఇన్నోవేషన్ సూచీలో భారత్‌కు 46వ ర్యాంకు
న్యూఢిల్లీ: ఈ ఏడాదికి సంబంధించి అంతర్జాతీయ నవకల్పనల (ఇన్నోవేషన్) సూచీలో భారత్ రెండు స్థానాలు ఎగబాకి 46వ ర్యాంకు దక్కించుకుంది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ఈ సూచీని నిర్వహిస్తుంది. గత కొన్నేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతోందని.. 2015లో 81వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 46వ స్థానానికి చేరిందని డబ్ల్యూఐపీవో ఒక ప్రకటనలో తెలిపింది. అపారమైన విజ్ఞాన సంపత్తి, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ, ప్రభుత్వ.. ప్రైవేట్ పరిశోధన సంస్థల కృషి ఇందుకు దోహదపడ్డాయని వివరించింది. జాతీయ ఆవిష్కరణల వ్యవస్థను సుసంపన్నం చేయడంలో ఆటమిక్ ఎనర్జీ విభాగం, శాస్త్ర..సాంకేతిక విభాగం, బయోటెక్నాలజీ విభాగం, అంతరిక్ష విభాగం మొదలైన సైంటిఫిక్ డిపార్ట్మెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని డబ్ల్యూఐపీవో పేర్కొంది. -
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2021లో మెరుగైన భారత్ ర్యాంకు
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారత్ తన ర్యాంకులను మెరుగుపరుచుకుంది. తాజాగా ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 ర్యాంకింగ్స్‌లో భారత్ 36.4 స్కోరుతో 46వ స్థానంలో ఉంది. గత ఏడాది 2020తో పోలిస్తే భారత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. అగ్రస్థానంలో 65.5 స్కోరుతో స్విట్జర్లాండ్ ఉండగా, స్వీడన్ 63.1 రెండవ, అమెరికా (61.3) మూడవ, బ్రిటన్ (59.8) నాల్గవ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా(59.3) ఐదవ స్థానంలో ఉన్నాయి. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ)లో తన స్థానాన్ని వేగంగా మెరుగుపరుచుకుంది. 2015లో 81 ర్యాంక్ నుంచి 2021లో 46కు చేరుకుంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో కూడా సృజనాత్మకత విషయంలో భారత్ ముందంజలో ఉంది. భారత ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ప్రస్తుతం దేశంలో కీలకంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధన సంస్థలు చేస్తున్న పనులు, అణుశక్తి శాఖ వంటి శాస్త్రీయ విభాగాలు; డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ; డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ; డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు నేషనల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మొదలైన విభిన్న రంగాలలోని విధానాలలో ఆవిష్కరణలను తీసుకొని రావడం కోసం నీతి ఆయోగ్ కృషి చేస్తోంది. ఈ ర్యాంకింగ్స్‌లో అంగోలా దేశం చివరి స్థానం(130)లో ఉంది.(చదవండి: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..!) -
నవకల్పనల్లో భారత్‌కు ‘టాప్’ ర్యాంకు
న్యూఢిల్లీ : నవకల్పన(ఇన్నోవేషన్)లకు సంబంధించి టాప్ 50 దేశాల జాబితాలో భారత్ తొలిసారి స్థానం దక్కించుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిల్చింది. 2020 సంవత్సరానికిగాను ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నవకల్పనల్లో టాప్ దేశాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ క్రమంగా చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా దేశాల స్థానాలు మెరుగుపడుతున్నాయని డబ్ల్యూఐపీవో పేర్కొంది. వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే నవకల్పనలకు సంబంధించి దిగువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. (ఇక వచ్చే ఏడాదే జీడీపీ ‘వెలుగు’) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సర్వీసుల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్లైన్ సర్వీసులు వంటి విభాగాల్లో టాప్ 15 దేశాల్లో చోటు దక్కించుకుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు నాణ్యమైన ఆవిష్కరణలకు తోడ్పడుతున్నాయని డబ్ల్యూఐపీవో తెలిపింది. జీఐఐ టాప్ 5 దేశాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఉన్నాయి. జీఐఐ కోసం 131 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేశారు. విద్యా సంస్థలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ తదితర అంశాల ప్రాతిపదికన ర్యాంకింగ్ ఇచ్చారు. (ఆర్థిక వృద్ధికి ఎయిర్‌పోర్టుల ఊతం) -
సంపన్న ఇండియా.. నిరుపేద భారత్..
‘‘ప్రపంచ నూతన ఆవిష్కరణల సూచి’’పై 2019కి గాను మొత్తం 126 దేశాలలో భారత్‌కు 52వ ర్యాంకు లభించింది. ఈ సూచిపై ఒక దేశం తాలూకు ర్యాంకును 7 ప్రాతిపదికల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటిలో ముఖ్యమైనవి కొన్ని 1) మార్కెట్ పరిణతి 2) విజ్ఞాన, సాంకేతిక ఆవిష్కరణలు 3) మానవ వనరుల అందుబాటు, పరిశోధన 4) వ్యాపార రంగంలో ఆధునికత 5) సృజనాత్మక ఆవిష్కరణలు 6) మౌలిక సదుపాయాలు 7) వ్యవస్థల ఉనికి... ఈ కొలబద్దల ఆధారంగా లభించిన మన ర్యాంకు (52) ఖచ్చితంగా మెరుగైనదే ! కానీ, అదే సమయంలో మనం 2018కి సంబంధించిన మన దేశం తాలూకు మరొక ర్యాంకును కూడా చూడాలి. అది, మన మానవాభివృద్ధి సూచీ. 2018లో, మొత్తం 189 దేశాలలో ఈ సూచీపై మన దేశానికి 130వ ర్యాంకు లభించింది. ఈ సూచీలో ర్యాంకింగ్‌ను ఇచ్చేందుకు ప్రాతిపదికలుగా : 1) ఆయు ప్రమాణాలు 2) విద్యాస్థాయి 3) తలసరి ఆదాయం వంటి వాటిని పరిగణిస్తారు. మన దేశం తాలూకు ర్యాంకుల మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. దేశంలో అత్యంత విజ్ఞానవంతులైన, నిపుణులైన మేధోవంతులైన, నాణ్యమైన కొనుగోలు శక్తి గల ప్రజల ఉనికిని ‘‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’’ 52వ ర్యాంకు చెబుతోంది. కాగా, విద్య, జీవన ప్రమాణాలను చెప్పే ‘‘మానవాభివృద్ధి సూచీ’’ విషయంలో మన దుస్థితిని మనకు లభించిన 130వ ర్యాంకు చెబుతోంది. మరి, ఈ పరస్పర విరుద్ధ, వైచిత్రితో కూడిన ర్యాంకులకు కారణం ఏమిటి ? దీనికి జవాబు సులువే. అది, మన దేశంలోనే రెండు దేశాలు ఉండటం. ఒకటి, మెజారిటీ సామాన్య పేద జనాల భారత్! రెండవది, అంతర్జాతీయ స్థాయి విద్యావంతులూ, బిలియనీర్లు ఉన్న ఇండియా!! మరి, 70 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం ఇటువంటి అసమానతలకు కారణం ఏమిటి ? దీనికి కారణాలు అనేకం. నిజానికి, స్వతంత్ర భారతం తొలిదశలోనే ఈ దేశం అంతర్జాతీయ స్థాయి ఉన్న ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి ఉన్నత విద్యాసంస్థలను ఏర్పరచుకుంది. కానీ దశాబ్దాలుగా మన ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగాలు ముఖ్యంగా సామాన్య జనాలకు విద్యనందించే సంస్థల ప్రమాణాలు నాసిరకంగానే ఉంటున్నాయి. 8వ తరగతికి చేరినా, తమ మాతృభాషలో కూడా సరిగా చదవలేని, గణితంలో చిన్న చిన్న కూడికలు కూడా చేయలేని స్థితిలో కోట్లాది మంది బాలలు ఉన్నారని, ఈ మధ్యన జరిగిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి ప్రీమియర్ సంస్థలలో విద్యను పొందిన వారిని కోట్లాది రూపాయల పారి తోషికంతో ఉపాధి ఆహ్వానిస్తోంది.. కొద్దిపాటి మేధోవంతులూ, కులీనులూ కూలీల పిల్లల మధ్యన అంతరాన్నీ, అగాథాన్ని సృష్టిస్తోన్న కథ ఇది. మన దేశం తాలూకు ఈ వైరుధ్యాన్ని ఎత్తిచూపే ఒక కార్టూన్, 1980లలో మన తెలుగు పత్రికలలో ఒకదానిలో వచ్చింది... అదినాటి ప్రధాని రాజీవ్ గాంధీ, దేశంలో కంప్యూటర్లను ప్రవేశపెట్టడానికి సంబంధించినది. ఆ కార్టూన్లో రాజీవ్‌గాంధీ జపాన్ నుంచి మన దేశంలోకి కంప్యూటర్ను ఒక విమానంలోనో, లేదా కనీసం నౌకలోనో తీసుకువస్తున్నట్లుగా కాక దానిని ఆయన ఒక ఎండ్లబండిపై తీసుకువస్తున్నట్లుగా కార్టూనిస్టు చిత్రించారు! పారిశ్రామికీకరణకు ముందరి వ్యవసాయ జీవన విధానం తాలూకు ప్రతిబింబం అయిన ఎండ్లబండి ఒక వైపున, పారిశ్రామిక విప్లవానంతర నూతన దశ తాలూకు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం రెండవ వైపునా ఈ కార్టూన్లో కనపడతాయి. నాటికీ నేటికీ అదే నిజం. నిజానికి 1990లలో ఆర్థిక సంస్కరణలతో ఈ వైరుధ్యం తాలూకు అసమానతలు మరింత పెరిగాయి. దీనికి, విద్యావ్యవస్థలోని లోపాలతో పాటుగా 1990ల అనంతర కులీన వర్గాల అనుకూల అభివృద్ధి నమూనా కూడా తోడయ్యింది. మౌలికంగా, వ్యవసాయాధారిత దేశస్తులమైన మనం ముందుగా, సరుకు ఉత్పత్తి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం కాకుండా, సూటిగా సాఫ్ట్వేర్, బీపీఓల వంటి అధిక నిపుణతల అవసరం ఉన్న సేవారంగంలోకి వెళ్ళాం. అంటే, మనం 1970–80లలో మన దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్నే పోలిన చైనా, దక్షిణ కొరియా, తైవాన్‌ల వంటి దేశాల బాటన ముందుగా పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం ఇచ్చుకొనే దిశలో ప్రయాణం చేయలేదు. పారిశ్రామికీకరణను నిర్లక్ష్యం చేశాం. 2014లో మేకిన్ ఇండియాకు శ్రీకారం చుట్టినా, అప్పటికే పుణ్యకాలం కాస్తా అయిపోయింది. కాబట్టే, ఈ అసమానతల పర్వం తాలూకు ప్రతిబింబాలుగా, నేడు మన కళ్ళ ముందు ‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’, ‘మానవాభివృద్ధి సూచీ’లు నిలుస్తున్నాయి. పైగా అంతర్జాతీయ క్షుద్బాధితుల సూచీపై 2018లో 119 దేశాలలో మనం 103వ స్థానంలో ఉండటం గమనార్హం. వ్యాసకర్త : డి.పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు, మొబైల్ : 98661 79615 -
‘ఇన్నోవేషన్’లో భారత్‌కు 52వ ర్యాంకు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) –2019లో భారత్ ఐదు స్థానాలు మెరుగుపరచుకుంది. ప్రపంచంలోని అత్యంత వినూత్న ఆర్థిక వ్యవస్థల ఆధారంగా రూపొందించే ఈ జాబితాలో మొత్తం 129 దేశాలు ఉండగా.. భారత్ 52వ స్థానాన్ని సొంతంచేసుకుంది. మేధో సంపత్తి ఫైలింగ్ రేట్స్ నుంచి మొబైల్ అప్లికేషన్ సృష్టి, విద్యా వ్యయం వంటి మొత్తం 80 ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంక్ నిర్ణయం జరుగుతుంది. ఇక ప్రపంచంలోని టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు స్థానం సంపాదించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ సమాచారాన్ని బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ తొలుత 25వ స్థానానికి ఆ తరువాత 10వ స్థానానికి చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు. మధ్య, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో భారత్ టాప్‌లో ఉన్నట్లు తెలిపారు. కార్మిక ఉత్పాదకత పెరుగుదల, సాంకేతిక ఉత్పాదన వృద్ధి, మేధో సంపత్తి సంబంధిత అంశాల మెరుగుదలతో పాటు సంస్థలు, మానవ మూలధనం, పరిశోధన పెరిగిన నేపథ్యంలో దేశ ర్యాంక్ మెరుగుపడింది. -
ఈ టెక్నాలజీ ఎగుమతుల్లో భారతే టాప్
సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో నిలిచింది. కంప్యూటింగ్‌తో కలిసి పనిచేసే బయోలజీ, మెటీరియల్ సైన్సులో నూతనావిష్కరణలకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కల్లా భారతే ఆధిపత్యంలో ఉందని యూఎన్ ఏజెన్సీ రిపోర్టు వెల్లడించింది. మొత్తంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 14 స్థానాలు ఎగబాకి, గతేడాది 85 ర్యాంకులో ఉన్న భారత్, తాజా నివేదికలో 61 స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ మేథోసంపత్తి సంస్థ(డబ్ల్యూఐపీఓ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి భాగస్వామ్యంతో సోమవారం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ) ర్యాంకులు జెనీవాలో విడుదల అయ్యాయి. సైన్సు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను రూపొందించడంలో భారత్ ప్రపంచంలో 8వ ర్యాంకును సంపాదించుకుంది. మానవ వనరులను భారత్ మెరుగుపరుచుకుందని, పరిశోధనలు పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది. యునిటైడ్ నేషన్స్‌లో డబ్ల్యూఐపీఓ ఓ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ. కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూలతో కలిసి పనిచేస్తూ.. ఇండెక్స్ తొమ్మిదవ ఎడిషన్‌ను డబ్ల్యూఐపీఓ సిద్ధంచేసింది. నూతనావిష్కరణలకు భారత్ కట్టుబడి ఉందని, ఆవిష్కరణ కొలమానాల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇన్నోవేషన్ ఎకానమీలకు దగ్గరగా భారత్ చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని కొనియాడారు. వ్యాపార వాతావరణంలో 117వ స్థానం, ఎడ్యుకేషన్‌లో 118వ ర్యాంకును భారత్ దక్కించుకుంది. మొత్తంగా ఈ ర్యాంకుల్లో స్విట్జర్లాండ్ టాప్ ఇన్నోవేటివ్ ఎకానమీగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో స్వీడన్, బ్రిటన్, అమెరికా, ఫిన్లాండ్, సింగపూర్లు ఉన్నాయి.