ఈ టెక్నాలజీ ఎగుమతుల్లో భారతే టాప్
సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ టాప్లో నిలిచింది. కంప్యూటింగ్తో కలిసి పనిచేసే బయోలజీ, మెటీరియల్ సైన్సులో నూతనావిష్కరణలకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కల్లా భారతే ఆధిపత్యంలో ఉందని యూఎన్ ఏజెన్సీ రిపోర్టు వెల్లడించింది. మొత్తంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 14 స్థానాలు ఎగబాకి, గతేడాది 85 ర్యాంకులో ఉన్న భారత్, తాజా నివేదికలో 61 స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ మేథోసంపత్తి సంస్థ(డబ్ల్యూఐపీఓ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి భాగస్వామ్యంతో సోమవారం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ) ర్యాంకులు జెనీవాలో విడుదల అయ్యాయి.
సైన్సు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను రూపొందించడంలో భారత్ ప్రపంచంలో 8వ ర్యాంకును సంపాదించుకుంది. మానవ వనరులను భారత్ మెరుగుపరుచుకుందని, పరిశోధనలు పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది. యునిటైడ్ నేషన్స్లో డబ్ల్యూఐపీఓ ఓ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ. కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూలతో కలిసి పనిచేస్తూ.. ఇండెక్స్ తొమ్మిదవ ఎడిషన్ను డబ్ల్యూఐపీఓ సిద్ధంచేసింది.
నూతనావిష్కరణలకు భారత్ కట్టుబడి ఉందని, ఆవిష్కరణ కొలమానాల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ఇన్నోవేషన్ ఎకానమీలకు దగ్గరగా భారత్ చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని కొనియాడారు. వ్యాపార వాతావరణంలో 117వ స్థానం, ఎడ్యుకేషన్లో 118వ ర్యాంకును భారత్ దక్కించుకుంది. మొత్తంగా ఈ ర్యాంకుల్లో స్విట్జర్లాండ్ టాప్ ఇన్నోవేటివ్ ఎకానమీగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో స్వీడన్, బ్రిటన్, అమెరికా, ఫిన్లాండ్, సింగపూర్లు ఉన్నాయి.