కోవిడ్–19 సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యసవ్థగా నిలవనుందని జాతీయ గణాంకాల కార్యలయం (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. ఆర్థిక సంవత్సరం ఎకానమీ 9.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని, ఈ స్థాయి వృద్ధి రేటును ప్రపంచలో ఏ దేశమూ సాధించే స్థితిలో లేదని పేర్కొంది. ఎన్‌ఎస్‌ఓ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు...
►2021 మే 31వ తేదీన వెలువడిన గణాంకాల ప్రకారం 2020–21లో జీడీపీ విలువ రూ.135.13 లక్షల కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.147.54 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. 2019–20 ఎకానమీ రూ. 145.69 లక్షల కోట్లకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ విలువ అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం.
► ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలిస్తే, జీవీఏ విలువ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) 8.6 శాతం వృద్ధితో రూ.124.53 లక్షల కోట్ల నుంచి రూ.135.22 లక్షల కోట్లకు పెరగనుంది.
► తయారీ రంగం వృద్ధి రేటు 7.2 శాతం క్షీణత నుంచి 12.5 శాతం వృద్ధిలోకి మారే వీలుంది.
► గనులు, తవ్వకాల విభాగంలో వృద్ధి 14.3 శాతంగా ఉండే అవకాశం ఉంది.
► ట్రేడ్, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి 11.9 శాతంగా నమోదుకావచ్చు.
► ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు 3.6 శాతం నుంచి 3.9 శాతానికి పెరుగే అవకాశం ఉంది.
‘బేస్ ఎఫెక్ట్’... విశ్లేషణలు..
అయితే ఈ స్థాయి వృద్ధి రేటుకు ప్రధానంగా లో బేస్ ఎఫెక్ట్ కారణమన్న విశ్లేషణలు ఉండడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 బేస్ ఇయర్‌ను గమనిస్తే కరోనా సవాళ్ల నేపథ్యంలో సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఎకానమీలో అసలు వృద్ధి లేకపోగా 7.3 % క్షీణతను నమోదుచేసుకోవడం గమనార్హం.
కోతల పర్వం ఇలా...
నిజానికి తొలుత 2021–22 ఎకానమీ వృద్ధి అంచనాలను 10 శాతంపైగా అంచనావేయడం జరిగింది. అయితే ఒమిక్రాన్, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో ఈ గణాంకాల అంచనాలు 8.4 శాతం నుంచి 10 శాతం వరకూ కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) అంచనాలు 9.5 శాతంకన్నా ఎన్‌ఎస్‌ఓ తాజా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం.
కాగా ఫిచ్ రేటింగ్స్ అంచనాలు 8.7 శాతం కాగా, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా 9.3 శాతంగా నమోదయ్యింది. ప్రపంచబ్యాంక్ అంచనా 8.3 శాతం. ఓఈసీడీ విషయంలో ఈ అంచనా ఇప్పటి వరకూ 9.7 శాతంగా ఉంది. కాగా గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఎకనమిక్ సర్వే వీటన్నింటకన్నా అధికంగా అంచనా 11 శాతంగా పేర్కొంది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–జూన్) 20.1 శాతం వృద్ధి రేటు అంచనావేయగం, జూలై–సెప్టెంబర్‌లో 8.4 శాతం వృద్ధి నమోదయ్యింది. కాగా, చైనా విషయంలో 2021–22 వృద్ధి అంచనాలు 8 శాతంగా ఉన్నాయి.
2030 నాటికి ఆసియాలో నెంబర్ 2గా భారత్
కాగా, 2030 నాటికి ఆసియాలో జపాన్‌ను పక్కకునెట్టి భారత్ రెండవ అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించే అవకాశం ఉందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే దేశ జీడీపీ జర్మనీ, బ్రిటన్‌లను దాటి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎదిగే వీలుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తరువాత ఆరువ స్థానంలో ఉంది. భారత్ జీడీపీ 2021లో 2.7 ట్రిలియన్ డాలర్లయితే, 2030 నాటికి ఈ విలువ 8.4 ట్రిలియన్ డాలర్లకు చేరే వీలుందని విశ్లేషించింది.
వృద్ధి బాటలో వేగంగా నడుస్తున్న మధ్యతరగతి, వినియోగం భారీ వృద్ధి వంటి అంశాలు భారత్‌కు లాభిస్తున్న ప్రధాన అంశాలని పేర్కొంది. దేశ వినియోగం 2020లో 1.5 ట్రిలియన్ డాలర్లు ఉంటే, ఇది 2030 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేషించింది. ఇంటర్‌నెట్ యూజర్ల సంఖ్య 2020లో 500 మిలియన్లు (50 కోట్లు) ఉంటే, 2030 నాటికి 1.1 బిలియన్‌లకు (110 కోట్లు) చేరుతుందని పేర్కొంది. కాగా, 2021–22 వృద్ధి అంచనాలను 8.2 శాతంగా పేర్కొంది. 2022–23లో ఈ రేటు 6.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment