న్యూఢిల్లీ: ఢిల్లీ, జైపూర్ మధ్య త్వరలో దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే నిర్మించే అవకాశం ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు మీడియాతో తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య రహదారిని నిర్మించడానికి తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక విదేశీ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఢిల్లీ-జైపూర్ మధ్య రహదారి విస్తరణతో పాటు, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే విషయంలో కూడా ఎలక్ట్రిక్ హైవే విస్తరణ కోసం స్వీడిష్ సంస్థతో కూడా చర్చలు జరుగుతున్నాయి అని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 22 గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేలు నిర్మించాలని చూస్తున్నట్లు, ఇప్పటికే వాటిలో ఏడింటి పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. (చదవండి: గంటల వ్యవధిలోనే రూ.21 కోట్ల ఆర్జన!)
"ఢిల్లీ నుంచి జైపూర్ వరకు ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడం నా కల. ఇది ఇప్పటికీ ప్రతిపాదిత ప్రాజెక్ట్. దీని కోసం మేము ఒక విదేశీ సంస్థతో చర్చిస్తున్నాము" అని నితిన్ గడ్కరీ వార్తా సంస్థ పీటీఐతో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, బస్సులు & ట్రక్కులు వంటి ప్రజా రవాణా వాహనాలను త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే, నితిన్ గడ్కరీ ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతిని సమీక్షించారు. ఈ రహదారి వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 24 గంటల నుంచి సగానికి తగ్గనున్నట్లు పేర్కొన్నారు. జైపూర్ - ఢిల్లీ మధ్య ప్రయాణం త్వరలో రెండు గంటలకు తగ్గనున్నట్లు ఆయన ప్రకటించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ప్రకారం వచ్చే ఏడాది మార్చి నాటికి ఢిల్లీ, జైపూర్ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment