2025పై ఐఏఎంఏఐ–కాంటార్ నివేదిక
గతేడాదితో పోలిస్తే 8% అప్
ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: భారతీయ భాషల్లో డిజిటల్ కంటెంట్‌కు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది 90 కోట్ల స్థాయిని దాటనుంది. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి చెందనుంది. 2024లో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 88.6 కోట్లుగా ఉంది. ఐఏఎంఏఐ, కాంటార్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు సగం మంది గ్రామీణ భారతదేశంలో ఉన్నారు.
వీరి సంఖ్య 48.8 కోట్లుగా ఉంది. దాదాపు 98 శాతం యూజర్లు భారతీయ భాషల్లో కంటెంట్‌ను వినియోగిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కంటెంట్ లభ్యత, డిమాండ్ అధికంగా ఉంది. పట్టణ ప్రాంత యూజర్లలో సగం మంది (సుమారు 57 శాతం) ప్రాంతీయ భాషల్లో కంటెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ వినియోగంలో లింగ అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని, ప్రస్తుతం మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 47 శాతం మంది మహిళలు ఉంటున్నారని నివేదిక పేర్కొంది.
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నప్పటికీ, విస్తృతి వేగం నెమ్మదిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోంది. స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ స్పీకర్లలాంటి సాంప్రదాయేతర సాధనాల వినియోగంలో పట్టణ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో ఇది 54 శాతం పెరిగింది. ఓటీటీ వీడియోలు, మ్యూజిక్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా మొదలైన వాటి వినియోగంలో పట్టణ యూజర్లను మించి గ్రామీణ యూజర్లు ముందుంటున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఈ–కామర్స్, ఆన్‌లైన్ చదువులు తదితర అంశాల్లో పట్టణ ప్రాంతాల వారు ముందంజలో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment