మే నెలలో బొగ్గు, గ్యాస్, విద్యుత్ దన్ను
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి మే నెలలో 6.3 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి మెరుగుపడటం ఇందుకు దోహదపడింది. గతేడాది ఇదే నెలలో ఇన్‌ఫ్రా రంగ వృద్ధి 5.2 శాతం. మరోవైపు, ఏప్రిల్‌లో నమోదైన 6.7 శాతంతో పోలిస్తే గత నెలలో వృద్ధి మందగించడం గమనార్హం. ఎరువులు, క్రూడాయిల్, సిమెంటు రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది.
పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది కీలక మౌలిక రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో.. బొగ్గు ఉత్పత్తి 10.2 శాతం, సహజ వాయువు 7.5 శాతం, విద్యుదుత్పత్తి 12.8 శాతంగా నమోదైంది. 2023లో ఇదే నెలలో ఇవి వరుసగా 7.2 శాతం, (–) 0.3 శాతం, 0.8 శాతంగా ఉన్నాయి.
రిఫైనరీ ఉత్పత్తుల తయారీ వృద్ధి రేటు 0.5 శాతానికి, ఉక్కు ఉత్పత్తి 7.6 శాతానికి మందగించింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం, దశలవారీగా సుదీర్ఘ సమయం పాటు పార్లమెంటు ఎన్నికలు జరగడం వంటి అంశాలు కొన్ని రంగాల్లో కార్యకలాపాలపై ప్రభావం చూపి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌కి భారీ డిమాండ్ నెలకొందని, ఏప్రిల్‌తో పోలిస్తే మే లో బొగ్గు, విద్యుత్ రంగాల వృద్ధికి ఇది దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. మే నెలలో ఐఐపీ వృద్ధి 4–5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నాయర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment