సాక్షి, ముంబై: భారత స్టీల్ మ్యాన్, టాటా స్టీల్ మాజీ ఎండీ జేజే ఇరానీ (86) ఇకలేరు. భారత ఉక్కు మనిషిగా పేరొందిన ఇరానీ సోమవారం అర్థరాత్రి జంషెడ్‌పూర్‌లో టాటా హాస్పిటల్‌లో మరణించారని టాటా స్టీల్ తెలిపింది. భారతదేశపు ఉక్కు మనిషి పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ కన్నుమూతపై టాటా స్టీల్ ప్రగాఢ సంతాపం తెలుపుతూ టాటా స్టీల్ ఒక ప్రకటన జారీ చేసింది. 1990ల ప్రారంభంలో భారతదేశ ఆర్థిక సరళీకరణ సమయంలో టాటా స్టీల్‌ను ముందంజలో నడిపించడమే కాకుండా, భారతదేశంలో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని సేవ చేసిన దార్శనికుడిని ఎన్నటికీ మరువలేమంటూ టాటా స్టీల్ తెలిపింది.
ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుండి పదవీ విరమణ చేశారు, 43 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించి పలువురి ప్రశంసలందుకున్నారు. తద్వారా కంపెనీకి కూడా అంతర్జాతీయ ఖ్యాతి, ప్రశంసలు, లభించాయి. 1979లో టాటా స్టీల్‌కు జనరల్ మేనేజర్‌గా, 1985లో ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1988లో టాటా స్టీల్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, 1992లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి 2001లో పదవీ విరమణ చేశారు.
జూన్ 2, 1936న నాగ్‌పూర్‌లో జన్మించిన డాక్టర్ ఇరానీ 1956లో నాగ్‌పూర్‌లోని సైన్స్ కాలేజీ నుండి బీఎస్‌ఈ, 1958లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి జియాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసారు.యూకేలోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి జేఎన్ టాటా స్కాలర్‌గా వెళ్ళారు. అక్కడ 1960లో మెటలర్జీలో మాస్టర్స్ 1963లో మెటలర్జీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. 1968లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (ప్రస్తుత టాటా స్టీల్)లో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేశారు. 1981లో బోర్డ్ ఆఫ్ టాటా స్టీల్‌లో చేరిన తరువాత 2001 నుండి ఒక దశాబ్దం పాటు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. టాటా స్టీల్, టాటా సన్స్‌తో పాటు, డాక్టర్ ఇరానీ టాటా మోటార్స్ , టాటా టెలిసర్వీసెస్‌తో సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 1963లో షెఫీల్డ్‌లోని బ్రిటీష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్‌తో కరియర్ ప్రారంభించారు.
పరిశ్రమకు ఆయన సేవలకుగాను 2007లో విశిష్ట పురస్కారం పద్మభూషణ్ వరించింది. డాక్టర్ ఇరానీ మెటలర్జీ రంగంలో తన సేవలకు గుర్తింపుగా 2008లో భారత ప్రభుత్వంచే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. 1992-93కి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అతను డాక్టర్ ఇరానీకి భార్య డైసీ ఇరానీ, అతని ముగ్గురు పిల్లలు జుబిన్, నీలోఫర్, తనాజ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment