భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వ్యాక్సిన్ తీసుకున్న వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. నేటి నుంచి ఫస్ట్, సెకండ్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులకు టికెట్ బుక్ చేసేటప్పుడు బేస్ ఛార్జీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. భారతదేశంలో ఈ ఆఫర్ ప్రకటించిన మొదటి విమానయాన సంస్థ ఇండిగో. బుకింగ్ సమయంలో భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుకున్న 18 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు గల వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందని సంస్థ తెలిపింది.
"బుకింగ్ సమయంలో ఈ ఆఫర్ పొందాలంటే ప్రయాణీకులు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. అలాగే, వారు విమానాశ్రయ చెక్-ఇన్ కౌంటర్/బోర్డింగ్ గేట్ వద్ద ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ లో వ్యాక్సినేషన్ స్టేటస్ చూపించాలి" అని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. "దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో, జాతీయ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మా వంతు సహకారం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. అలాగే, ప్రతి ప్రయాణికుడు తక్కువ ధరలకే సురక్షితంగా ప్రయాణించేలా ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు" తెలిపారు. ఈ ఆఫర్ ప్రస్తుతం ఇండిగో వెబ్ సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment