
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాలలో గల షేర్లను విక్రయించేటప్పుడు ఇకపై రిటైల్ ఇన్వెస్టర్లకు కొత్త వెసులుబాటు లభించనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నిబంధనలను వచ్చే నెల(ఆగస్ట్) 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విక్రయించిన షేర్లు వారి ఖాతాలోనే బ్లాక్(నిలుపుదల) కానున్నాయి. సేల్ ప్రక్రియ పూర్తయితేనే కొనుగోలుదారు ఖాతాలోకి బదిలీ అవుతాయి. ఒకవేళ వాటాల అమ్మకం విఫలమైతే ఖాతాలో తిరిగి అందుబాటులోకి(అన్‌బ్లాక్) రానున్నాయి. ఇప్పటివరకూ ఎర్లీ పే ఇన్(ఈపీఐ) విధానం ప్రకారం క్లయింట్లు షేర్లను విక్రయిస్తే ఖాతా నుంచి బదిలీ అవుతున్నాయి. అమ్మకం లావాదేవీ ఫెయిలైతే(ఎగ్జిక్యూట్ కాకుంటే) తిరిగి షేర్లు వెనక్కి వస్తున్నాయి.
బదిలీకాకుండా
తాజా నిబంధనల ప్రకారం అమ్మకం లావాదేవీని చేపట్టాక షేర్లు డీమ్యాట్ ఖాతాలో బ్లాక్ కానున్నాయి. సేల్ ప్రక్రియ పూర్తయితేనే బదిలీ అవుతాయి. లేకుంటే అదే ఖాతాలో ట్రేడింగ్ చేసేందుకు రిలీజ్ అవుతాయి. సేల్ చేసిన షేర్లు టైమ్ ప్రాతిపదికన క్లయింట్ డీమ్యాట్ ఖాతాలో బ్లాక్ కానున్నాయి. అయితే ఇది క్లయింట్లు కోరుకుంటేనే అమలుకానుంది. ఈ విధానంతోపాటు ఈపీఐ నిబంధనలు సైతం అమలుకానున్నట్లు సెబీ సర్క్యులర్‌లో పేర్కొంది. అమ్మకం లావాదేవీ పూర్తికాని సందర్భాల్లో షేర్లు క్లియరింగ్ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యాక తిరిగి వెనక్కి రావడంలో జాప్యం జరిగే సంగతి తెలిసిందే. ఇలాంటి సమస్యలకు నివారణగా.. సెబీ తాజా నిబంధనలు రూపొందించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇందుకు తగిన విధంగా డిపాజిటర్లు, క్లియరింగ్ కార్పొరేషన్లు తమ వ్యవస్థలను ఆధునీకరించవలసిందిగా సెబీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment