ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ పరిశ్రమ రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని, ఆదాయాలు 11 శాతం దాకా వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు.. బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), హెల్త్‌కేర్, రిటైల్, తయారీ తదితర రంగాల్లో డిజిటలీకరణ వేగవంతం కానుండటం, ఔట్‌సోర్సింగ్ వంటి అంశాలు రికవరీకి దోహదపడగలవని పేర్కొంది. పరిశ్రమ వృద్ధి అంశంపై విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ కూడా రెండంకెల స్థాయిని అంచనా వేస్తుండటం గమనార్హం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం ఐటీ సేవల పరిశ్రమ 2020–21లో 2.7 శాతం వృద్ధి చెంది 99 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ–కామర్స్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ మొదలైన విభాగాలన్నీ కలిపితే 2.3 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
డిజిటల్ డీల్స్ జూమ్..
కంపెనీల నిర్వహణ మార్జిన్లు మరింత మెరుగుపడటానికి లాభదాయకమైన డిజిటల్ ఒప్పందాలు ఉపయోగపడగలవని క్రిసిల్ తెలిపింది. ‘వ్యయాలను తగ్గించుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నందున ఐటీ సేవల ఔట్‌సోర్సింగ్ అంతర్జాతీయంగా క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రిమోట్ వర్కింగ్, ఈ–కామర్స్, ఆటోమేటెడ్ సేవలు వంటి విధానాలు పెరిగిన నేపథ్యంలో, డిజిటల్ సర్వీసుల వ్యాపారావకాశాలు మరింత పెరిగాయి‘ అని సంస్థ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. 2020–21లో దేశీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల పరిమాణం 20 శాతం పెరగ్గా.. ఇందులో సుమారు 80 శాతం వాటా డిజిటల్ డీల్స్‌దే ఉందని ఆయన పేర్కొన్నారు.
క్రిసిల్ అంచనాల్లో మరికొన్ని..
► ఐటీ సర్వీసుల ఆదాయంలో సుమారు 28 శాతం వాటా ఉండే బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం .. ఈ ఆర్థిక సంవత్సరం 13–14 శాతం వృద్ధి నమోదు చేయనుంది. డిజిటల్ లావాదేవీలు, డేటా భద్రతరమైన జాగ్రత్తలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్‌ఎస్‌ఐ వృద్ధి 9 శాతంగా నమోదైంది.
► ఐటీ ఆదాయాల్లో 30 శాతంగా ఉండే రిటైల్, తయారీ విభాగాలు ఈసారి కాస్త కోలుకుని 8–9 శాతం మేర వృద్ధి చెందవచ్చు. 2020–21లో ఇవి 2–3 శాతం క్షీణించాయి.
► కోవిడ్–19ని ఎదుర్కొనేందుకు మరింత వ్యయం చేస్తున్నందున హెల్త్‌కేర్ విభాగం వృద్ధి భారీగా 15–16 శాతం స్థాయిలో కొనసాగనుంది. ఐటీ సేవల ఆదాయంలో దీని వాటా 6 శాతం.
► ఆదాయ వృద్ధి మెరుగుపడినప్పటికీ 2020–21లో నమోదైన స్థాయికి మించి లాభదాయకత పెరగకపోవచ్చు. ప్రయాణాలు, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తగ్గడం వంటి అంశాల కారణంగా నిర్వహణ మార్జిన్లు 2 శాతం మెరుగుపడి ఏడేళ్ల గరిష్టమైన 25 శాతానికి పెరిగాయి. అయితే, ఈసారి క్రమంగా వ్యాపారపరంగా సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నందున ఇవి తగ్గవచ్చని అంచనా.
► ఐటీ సర్వీసులకు కీలకమైన అమెరికా, యూరప్ మార్కెట్లలో కరోనా మహమ్మారి కొత్తగా మళ్లీ విజృంభించే అవకాశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
రెండంకెల స్థాయిలో వృద్ధి: ప్రేమ్‌జీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేయగలదని ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమ 2–3 శాతం వృద్ధి చెందడంతో పాటు నికరంగా కొత్తగా 1.58 లక్షల ఉద్యోగాలను కల్పించిన నేపథ్యంలో ఈసారి అంతకన్నా మెరుగ్గా రాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రేమ్‌జీ ఈ విషయాలు తెలిపారు. మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ అమలైన పరిస్థితుల్లో ఐటీ రంగం శరవేగంగా కొత్త మార్పులను ఆకళింపు చేసుకుని, యావత్‌ప్రపంచం ముందుకు సాగేందుకు తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొద్ది వారాల్లోనే కంపెనీలు.. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మారాయని, ఇప్పటికీ చాలా ప్రాజెక్టులకు సంబంధించి 90 శాతం దాకా సిబ్బంది ఇదే విధానంలో పనిచేస్తున్నారని ప్రేమ్‌జీ వివరించారు. కొంత మంది సిబ్బంది ఇంటి నుంచి, మరికొందరు ఆఫీసులోను పనిచేసే హైబ్రిడ్ విధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
ఐటీ.. రికవరీ పటిష్టం
Published Thu, Jul 8 2021 6:24 AM | Last Updated on Thu, Jul 8 2021 6:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment