న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులు వీలైనంత ముందుగా పన్ను రిటర్నులను (ఐటీఆర్‌లు) దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్‌ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. గతేడాది కంటే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ‘‘పన్ను రిటర్నులను దాఖలు చేసే వారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతేడాది కంటే చాలా వేగంగా రిటర్నులు దాఖలు అవుతున్నాయి.
చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా రిటర్నులు దాఖలు చేసుకోవాలన్నది మా సూచన. జూలై 31కి ఇంకా ఎన్నో రోజులు లేనందున వెంటనే రిటర్నులు దాఖలు చేసుకోవాలి’’అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యంపై మాట్లాడుతూ.. 10.5 శాతం వృద్ధి రేటు స్థాయిలోనే ఆదాయం ఉంటుందన్నారు. జీఎస్‌టీ పరంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం ఆదాయం వృద్ధి చెందినట్టు చెప్పారు. 2023–24 బడ్జెట్ ఆధారంగా చూస్తే స్థూలంగా రూ.33.61 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.18.23 లక్షల కోట్లను కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో వసూలు చేయాలన్నది లక్ష్యం. గతేడాదితో పోలిస్తే 10.5 శాతం ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment