ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికి కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వ్యక్తులకు, హౌసింగ్ సొసైటీలకు ఆస్తి పన్నుపై రాయితీలు ఇవ్వనున్నట్లు కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇటీవల నోటిఫై చేసిన మహారాష్ట్ర ఈవీ పాలసీ 2021 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి సాతేజ్ పాటిల్ ప్రకటించారు. ముంబై, వసాయి-విరార్, నవీ ముంబై, థానే, కళ్యాణ్-డొంబివాలి, నాగ్ పూర్, నాసిక్, పూణే, పింప్రి-చించ్వాడ్, ఔరంగాబాద్ నగరాలతో సహా ఇతర నగరాలలో కూడా ఈ రాయితీ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.
"ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే హౌసింగ్ సొసైటీలు, వ్యక్తులకు ఆస్తి పన్నులో రాయితీలు ఇచ్చిన మొదటి సంస్థగా కొల్హాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ నిలవనుంది. ఇటీవల, మహారాష్ట్ర ప్రభుత్వం 2021 ఈవీ పాలసీని ప్రకటించింది. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు) అన్ని కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో 10 శాతం ఉండాలని కూడా ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది" అని పాటిల్ ట్వీట్ చేశారు. కొల్హాపూర్ మునిసిపల్ పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, హౌసింగ్ సొసైటీల వారికి పన్ను రాయితీలు వెంటనే అందుబాటులో ఉంటాయని మంత్రి ప్రతినిధి ధృవీకరించారు. "ఎవరైనా సొంతం కోసం చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఆస్తి పన్నుల్లో రెండు శాతం, వాణిజ్య వినియోగం కోసం ఏర్పాటు చేస్తే అయిదు శాతం రాయితీ ఇవ్వనున్నారు" అని ప్రతినిధి తెలిపారు.
(చదవండి: వారు చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా!)
Comments
Please login to add a commentAdd a comment