ప్రస్తుత ఆర్థిక సంవత‍్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్యాంక్ నికర లాభం దాదాపు 27 శాతం ఎగసి రూ. 2,185 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17 శాతం పెరిగి రూ. 3,913 కోట్లను అధిగమించింది. అయితే లోన్‌బుక్ 4 శాతం క్షీణించి రూ. 2.04 లక్షల కోట్లను తాకగా.. డిపాజిట్లు 12 శాతంపైగా పెరిగి రూ. 2.61 లక్షల కోట్లకు చేరాయి.
ఎన్‌ఐఎం వీక్
నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.61 శాతం నుంచి 4.52 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ. 369 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 0.15 శాతం తగ్గి 2.55 శాతానికి చేరగా.. నికర ఎన్‌పీఏలు సైతం 0.23 శాతం తక్కువగా 0.64 శాతంగా నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 2,947 కోట్లను తాకింది. కొటక్ సెక్యూరిటీస్ లాభం 34 శాతం పెరిగి రూ. 199 కోట్లకు చేరగా.. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం 19 శాతం వృద్ధితో రూ. 171 కోట్లను తాకింది. అయితే ప్రైమ్ లాభం 23 శాతం క్షీణించి రూ. 133 కోట్లుగా నమోదైంది. క్యూ2లో కొటక్ బ్యాంక్‌లో వాటాను ఎల్‌ఐసీ 2.45 శాతం నుంచి 3.18 శాతానికి పెంచుకుంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం కొటక్ మహీంద్రా షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం ఎగసి రూ. 1,406 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment