సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 1,750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ కార్గో 3 వీలర్ సఫర్ జంబో వాహనాన్ని మంగళవారం ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ ఈ విషయాలు వెల్లడించారు. ‘గోల్ఫ్ కార్ట్ ప్రాజెక్ట్ కోసం సెజ్‌లో యూనిట్ ఏర్పాటును పరిశీలిస్తున్నాం. సెజ్‌లో యూనిట్‌తో పాటు బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల బ్యాటరీల స్వాపింగ్ (మార్పిడి)కి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని ఆమె తెలిపారు.
దీనిపై ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్ గోల్ఫ్‌కార్టులు, ఇతరత్రా ఎలక్ట్రిక్ ఆఫ్–రోడ్ వాహనాల డిజైన్, తయారీకి సంబంధించి టొనినో లంబోర్గినితో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్ గ్రూప్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ‘దేశంలోనే అతి పెద్ద త్రిచక్ర వాహనాల మార్కెట్లలో ఒకటైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి ఈ–రిక్షాలకు పెద్ద గా మార్కెట్ లేదు. హై–స్పీడ్ త్రీవీలర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటోంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెస్తే ఎలక్ట్రిక్ వాహనాలకూ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది‘ అని సులజ్జా చెప్పారు.
మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్గో...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్.. సరుకు రవాణా కోసం సఫర్ జంబో పేరుతో పూర్తిగా దేశీయంగా తయారు చేసిన కార్గో త్రీ వీలర్ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ–కామర్స్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కంపెనీ ఈ వాహనాన్ని రూపొందించింది. 500 కిలోల బరువు మోయగలదు. టాప్ స్పీడ్ 55 కిలోమీటర్లు. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. స్టీల్ బాడీ, డిజిటల్ క్లస్టర్, కైనెటిక్ కనెక్ట్ యాప్, జీపీఎస్, ఇండిపెండెంట్ రేర్ సస్పెన్షన్, హైడ్రాలిక్ బ్రేక్స్ వంటి హంగులు ఉన్నాయి. ఫేమ్–3 కింద కస్టమర్లు సబ్సిడీ పొందవచ్చు. మూడేళ్ల వారంటీ ఉంది.
విభిన్న వేరియంట్లు సైతం..
వచ్చే 6–7 నెలల్లో 5,000లకుపైగా సఫర్ జంబో యూనిట్లను అందించాలన్నది సంస్థ భావన అని ౖMðనెటిక్ గ్రీన్ ఎనర్జీ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ మంగళవారం ఆన్‌లైన్ వేదికగా మీడియాకు తెలిపారు. డీజిల్ కార్గో త్రీ వీలర్‌కు కిలోమీటరుకు రూ.3 ఖర్చు అయితే, సఫర్ జంబోకు 50 పైసలు మాత్రమేనని వివరించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ, వ్యర్థాల సేకరణ కోసం ఉపయోగపడే విధంగా పలు కొత్త మోడళ్లకు రూపకల్పన చేయనున్నట్టు వెల్లడించారు. సంస్థ అనుబంధ కంపెనీ కైనెటిక్ మొబిలిటీ లీజు ప్రాతిపదికన ఈ–కార్గో వాహనాలను సమకూరుస్తోందని ఆమె గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment