ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే భూముల ధరలు తక్కువ | Land prices AP compared to those states who attracts more investments | Sakshi
Sakshi News home page

ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే భూముల ధరలు తక్కువ

Published Mon, Apr 5 2021 12:30 PM | Last Updated on Mon, Apr 5 2021 12:33 PM

Land prices AP compared to those states who attracts more investments - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఆరు అంశాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ) ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారికి నష్టభయం లేకుండా.. జీవితకాలం చేయూత (హ్యాండ్‌ హోల్డింగ్‌)నందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల కనుగుణంగా ఆరు కీలక ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా.. పెట్టుబడిలో అత్యధిక వ్యయమయ్యే భూమిని చౌకగా అందించడం, తక్కువ రేటుకే నీరు, విద్యుత్‌ సౌకర్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను పుష్కలంగా అందుబాటులో ఉంచడం, ఏపీ వన్‌ పేరుతో ప్రాజెక్టు ప్రతిపాదన నుంచి ఆ పరిశ్రమ జీవితకాలం వరకు చేయూతనివ్వడంతోపాటు కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి ఇస్తున్న రాయితీలను బలంగా తీసుకెళ్లనుంది. ఈ ఏడాది దేశ విదేశాల్లో నిర్వహించే రోడ్‌ షోలు, పెట్టుబడుల సదస్సుల్లో ప్రధానంగా ఈ ఆరు అంశాలను వివరించనున్నారు.

తక్కువ రేటుకే కావాల్సినంత భూమి..
పెట్టుబడులు అత్యధికంగా వచ్చే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి వాటితో పోలిస్తే తక్కువ రేటుకే కావాల్సినంత భూమి ఏపీలో అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో పరిశ్రమలకు ఒక ఎకరా సగటున రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలకు లభిస్తుంటే ఈ రాష్ట్రాల్లో రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఏ రాష్ట్రాల్లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చేతిలో 48,352 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మరింత భూమిని కూడా సేకరిస్తోంది. కొత్త పారిశ్రామిక విధానంలో ప్రాజెక్టు ప్రారంభ వ్యయం తగ్గించేలా భూములను లీజు విధానంలో కేటాయిస్తోంది. విజయవంతంగా పదేళ్ల ఉత్పత్తి పూర్తి చేశాక వాటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. మరోపక్క ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో నేరుగా వచ్చి ఉత్పత్తి ప్రారంభించుకునేలా అన్ని వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది.

పుష్కలంగా విద్యుత్, నీరు..
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. పోటీ రాష్ట్రాల్లో పరిశ్రమలకు యూనిట్‌ రూ.7 నుంచి రూ.10 వరకు చార్జ్‌ చేస్తుంటే ఏపీలో రూ.6 నుంచి రూ.7కే ఇస్తోంది. అలాగే పరిశ్రమలకు తక్కువ రేటుకే నిరంతరాయంగా నీటిని అందించడానికి ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చడంతోపాటు ప్రత్యేకంగా రిజర్వాయర్ల నుంచి పారిశ్రామిక పార్కులకు నీటిని తరలిస్తోంది. పోటీ రాష్ట్రాల్లో కిలో లీటరుకు రూ.45 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తుంటే మన రాష్ట్రంలో రూ.50-55కే అందిస్తోంది.

నైపుణ్యానికి పెద్దపీట
రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధికి సర్కార్‌ పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీతోపాటు 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ వేతనానికే నైపుణ్యం కలిగిన కార్మికులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో రోజుకు సగటున రూ.233.3 వేతనానికే నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉంటే పోటీ రాష్ట్రాల్లో రూ.280 నుంచి రూ.329 వరకు చెల్లించాల్సి వస్తోంది.

రాయితీలతోపాటు చేయూత
రాష్ట్రంలో ఏపీ వన్‌ ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలతో వచ్చినప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభించి.. అమ్మకాల వరకు జీవితకాలం చేయూత (హ్యాండ్‌ హోల్డింగ్‌)ను సర్కార్‌ అందిస్తోంది. సింగిల్‌ విండో విధానంలో 10 రకాల సేవలను కల్పిస్తోంది. పరిశ్రమ విస్తరణ కార్యక్రమాలు చేపట్టే వారికీ అనేక పారిశ్రామిక రాయితీలు ఇస్తోంది. భారీ పెట్టుబడులకు టైలర్‌మేడ్‌ విధానంలో రాయితీలు అందించనుంది. ఎలక్ట్రానిక్‌ రంగంలో ఉత్పత్తి ఆధారిత రాయితీలు, వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లో ఏర్పాటు చేసే యూనిట్లకు అదనపు రాయితీలను ఇస్తోంది.

నష్టభయం లేకుండా..
రాష్ట్రంలో తక్కువ వ్యయంతో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా మౌలిక వసతులు కల్పించడంతోపాటు నష్టభయం లేకుండా హ్యాండ్‌ హోల్డింగ్‌ అందించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల ప్రకారం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతోపాటు సమగ్ర పారిశ్రామిక సర్వే ద్వారా పరిశ్రమలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుని భర్తీ చేస్తున్నాం. ఇవే అంశాలను ప్రచారం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. -జవ్వాది సుబ్రహ్మణ్యం, డైరెక్టర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement