వాషింగ్టన్: నవలా రచయిత్రి, అమెజాన్ షేర్ హోల్డర్ మెకాంజీ స్కాట్ పెద్ద మనసు చాటుకున్నారు. నాలుగు నెలల కాలంలో పలు స్వచ్ఛంద సంస్థలకు సుమారు 4 బిలియన్ డాలర్లకు పైగా విరాళాలు అందజేశారు. ఒక్క జూలై నెలలోనే 1.7 బిలియన్ డాలర్లు దానం చేసి దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. కాగా మెకాంజీ.. అమెజాన్ సంస్థ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య అన్న విషయం విదితమే. 25 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాము విడాకులు తీసుకున్నామని ఈ జంట గతేడాది సంయుక్త ప్రకటన విడుదల చేసింది. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్ ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్ అమెజాన్ షేర్లను జెఫ్ బెజోస్ మెకాంజీ పేరిట బదలాయించినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె ప్రపంచంలోనే 18వ సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఇక బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ తాజా వివరాల ప్రకారం మెకాంజీ సంపద 23 బిలియన్ డాలర్ల నుంచి 60.7 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అమెజాన్‌లో భాగస్వామి అయినందు వల్లే ఆమెకు ఈ మేర ఆదాయం చేకూరింది. ఈ నేపథ్యంలో మెకాంజీ తన సంపాదనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సిందిగా తన టీంను ఆదేశించినట్లు మంగళవారం పేర్కొన్నారు. అదే విధంగా.. ‘‘మహమ్మారి కరోనా కారణంగా అమెరికన్ల జీవితాలు అతలాకుతలమయ్యాయి.
ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు మహిళ జీవితాన్ని మరింత విపత్కర పరిస్థితుల్లోకి నెట్టాయి. పేదరికంలో మగ్గుతున్న వారి బతుకులు దుర్భరంగా మారాయి. అయితే బిలియనీర్ల సంపద మాత్రం అంతకంతకూ పెరిగిపోయింది’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆహార భద్రత కల్పించే దిశగా, జాతి వివక్షను పారద్రోలేందుకు కృషి చేస్తున్న సుమారు 6500 ఆర్గనైజేషన్లను పరిగణనలోకి తీసుకుని, వాటిలో 383 గ్రూపులకు విరాళాలు అందజేసినట్లు తెలిపారు. ఇక మెకాంజీ దాతృత్వం గురించి రాక్‌ఫెల్లర్ ఫిలాంత్రపీ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెలీసా బెర్మన్ మాట్లాడుతూ.. స్కాట్ ఈ ఏడాదిలో మొత్తంగా సుమారు 6 బిలియన్ డాలర్ల మేర విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2020లో ఈ స్థాయిలో చారిటీలకు డబ్బు పంచిన ఏకైక వ్యక్తి ఆమేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment