పదేళ్లలో భారత్‌ను విడిచిపెట్టినవారు ఇంతమందా?.. కారణం ఇదేనా.. | Many People Have Left India in Ten Years Here is The Reason | Sakshi
Sakshi News home page

పదేళ్లలో భారత్‌ను విడిచిపెట్టినవారు ఇంతమందా?.. కారణం ఇదేనా..

Published Sat, Nov 9 2024 6:20 PM | Last Updated on Sat, Nov 9 2024 7:35 PM

Many People Have Left India in Ten Years Here is The Reason

2023లో  2 లక్షల 16వేల మంది

2019లో లక్షా 44వేల మంది

2014లో లక్షా 29 వేల మంది

ఎవరు వీళ్లంతా.... 2014 నుంచి 2023 వరకు వీళ్ల సంఖ్య ఎందుకు పెరుగుతోంది..?

వీళ్లంతా భారతీయులే... మన దేశంలో పుట్టి పెరిగిన వాళ్లే...

కానీ ఇప్పడు వీళ్లు మన దేశంలో లేరు.. పౌరసత్వాన్ని కూడా వదిలేసుకున్నారు...

వివిధ దేశాలకు తరలివెళ్లి...అక్కడే శాశ్వత పౌరులుగా ఉండిపోయారు...

2014 తర్వాత.. ఈ పదేళ్లలో దేశాన్ని విడిచిపెట్టిన వారి సంఖ్యలో 67శాతం పెరుగుదల నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి రోజులను గుర్తు చేసుకుందాం. పాలన చేపట్టిన కొన్నాళ్లకే మోదీ ఓ పథకాన్ని తీసుకొచ్చారు.. అదే మేక్‌ ఇన్‌ ఇండియా..!  భారత్‌ను ప్రపంచంలో టాప్‌ మాన్యుఫాక్చరింగ్ సెంటర్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే సీన్‌ కట్ చేస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో హిట్‌ కాలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇండియన్స్‌ భారీగా భారత్‌ను విడిచి వెళ్తున్నారని.. పెట్టుబడులు కూడా ఇతర దేశాల్లో ఎక్కువగా పెడుతున్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

చాలా మంది భారతీయులు.. ముఖ్యంగా బడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఇండియాలో కాకుండా విదేశాలలో అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఇటీవల భారత పౌరసత్వం విడిచిపెట్టిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. 2022లో 2 లక్షల 25 వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. వీరంతా ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లారు. అక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ వీరిని ఎక్కువగా ఆకర్షించింది.

విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కారణాలు
మరోవైపు భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతుండడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో పన్ను వసూలు ఎక్కువ. దీని కారణంగా ఇండియాలో వ్యాపారం చేయడం కష్టంతో పాటు నష్టంతో కూడుకున్న విషయమని చాలామంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అటు వైద్య సేవలు, విద్య, భద్రత లాంటి అంశాల కోసం జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇక కొన్ని దేశాలు నైపుణ్యం కలిగిన వ్యక్తులకు, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొన్ని యూరప్ దేశాలు, కరేబియన్ దేశాలు పెట్టుబడుల ద్వారా పౌరసత్వం లేదా రెసిడెన్సీ ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. దీంతో మార్కెట్ రిస్క్ ఎందుకని.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడితే బెటర్‌ అని చాలామంది భారతీయులు భావిస్తున్నారు...!

భారతీయులు ఇతర దేశాల్లో పెట్టుబడులు భారీగా పెడుతుండడానికి పదేళ్ల నుంచి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయడపతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని ఆర్థిక విధానాలు, దేశీయ పెట్టుబడిదారులకు భయాన్ని కలిగించాయి. ఉదాహరణకు.. డీమానిటైజేషన్.. అంటే నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీశాయన్నది నిపుణుల మాట. 2016లో నోట్ల రద్దు తర్వాత బడా వ్యాపారులు తమ పెట్టుబడులను ఇండియాలో ఉపసంహరించుకున్నారు. అటు నోట్ల రద్దు తర్వాత, చిన్న వ్యాపారాలు MSME సంస్థలు భారీ నష్టాల పాలయ్యాయి. ఆ తర్వాత దేశీయ పెట్టుబడులు క్రమంగా తగ్గాయి.

వ్యాపారుల కష్టాలను పెంచిన జీఎస్‌టీ
మరోవైపు 2017లో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం కూడా వ్యాపారుల కష్టాలను పెంచింది. జీఎస్టీ అమలు తర్వాత వ్యాపార ఖర్చులు పెరిగాయి. దీంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం తగ్గిపోయింది. ఇక 2014 తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే  ఇండియాలో తగినంత అవకాశాలు లేకపోవడంతో యువత ఎక్కువగా విదేశాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు అక్కడే పెట్టుబడులు కూడా పెట్టుకుంటున్నారు. 2014 నుంచి 2020 వరకు దేశీయ ఉపాధి రేటు కేవలం 3-4శాతం మాత్రమే ఉంది.

ఇదీ చదవండి: ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..

పెట్టుబడిదారులకు శాపంగా పన్నులు
దేశంలో పెరిగిన పన్నులు పెట్టుబడిదారులకు శాపంగా మారాయి. ఫ్లిప్‌కార్ట్ లాంటి భారతీయ కంపెనీలు కూడా విదేశాలలో పెట్టుబడులు పెంచడం ప్రారంభించాయి. అటు భారత్‌ రూపాయి విలువ అంతర్జాతీయంగా తగ్గిపోవడం కూడా పెట్టుబడిదారులపై ప్రభావం చూపింది.  రూపాయి విలువ 2014లో డాలర్‌కి 60 రూపాయల వద్ద ఉంటే ఇప్పుడది 80 దాటేసింది. ఇలా మేకిన్‌ ఇన్‌ ఇండియా ఫెయిల్యూర్‌, పన్నులు, నోట్ల రద్దు, జీఎస్టీ, రూపాయి బలహీనత లాంటి అంశాలు భారత్‌ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో విదేశాల్లో భారతీయ పెట్టుబడులు పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement