మార్కెట్లకు ‘టారిఫ్‌’ రిలీఫ్‌ | Markets set for a positive start as Trump pauses tariffs on Canada and Mexico | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు ‘టారిఫ్‌’ రిలీఫ్‌

Feb 5 2025 3:56 AM | Updated on Feb 5 2025 7:54 AM

Markets set for a positive start as Trump pauses tariffs on Canada and Mexico

పన్నుల యుద్ధానికి ట్రంప్‌ తాత్కాలిక విరామం

మెక్సికో, కెనడాలపై సుంకాలు నెలరోజుల పాటు నిలిపివేత   

ఈక్విటీ మార్కెట్ల భారీ ర్యాలీ 

నెలరోజుల గరిష్టం వద్ద సూచీల ముగింపు  

ఒక్కరోజులో రూ.5.96 లక్షల కోట్ల సంపద సృష్టి

ముంబై: మెక్సికో, కెనడాపై సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లు మంగళవారం బలంగా పుంజుకున్నాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలూ, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ అంశాలూ కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 1,397 పాయింట్లు పెరిగి 78,584 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 378 పాయింట్లు బలపడి 23,739 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది నెలరోజుల గరిష్టం కావడం విశేషం.

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,472 పాయింట్లు పెరిగి 78,659 వద్ద, నిఫ్టీ 402 పాయింట్లు ఎగసి 23,763 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా స్టాక్‌ సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.  

ఇటీవల మార్కెట్‌ పతనంలో భాగంగా పలు రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లకు పెద్ద ఎత్తున డిమాండ్‌ లభించింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 1.35%, 1.25 శాతం పెరిగాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ జరిగింది. 

రంగాల వారీగా అత్యధికంగా క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 3.50% పెరిగింది. ఇండస్ట్రియల్స్‌ 2.50%, ఆయిల్‌అండ్‌గ్యాస్‌ 2.40%, విద్యుత్, ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ సూచీలు రెండు శాతం లాభపడ్డాయి.  

స్టాక్‌ మార్కెట్‌( stock market) దాదాపు రెండు శాతం ర్యాలీతో మంగళవారం రూ.5.96 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.425 లక్షల కోట్ల(4.88 ట్రిలియన్‌ డాలర్లు)కు 
చేరుకుంది. 

రూపాయి విలువ జీవితకాల కనిష్టం(87.11) నుంచి స్వల్పంగా రికవరీ అయ్యింది. డాలర్‌ మారకంలో నాలుగు పైసలు బలపడి 87.07 వద్ద స్థిరపడింది. ట్రంప్‌ వాణిజ్య యుద్దానికి తాత్కాలిక తెరవేయడంతో అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ 108 స్థాయికి దిగివచ్చింది. ఈ అంశం దేశీయ కరెన్సీకి కలిసొచ్చిందని నిపుణులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement