న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.1,420 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,391 కోట్లతో పోలిస్తే 2 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 10.34 శాతం వృద్ధి చెంది రూ. రూ.16,998 కోట్ల నుంచి రూ.18,756 కోట్లకు చేరింది. క్యూ2లో కొంత డిమాండ్ పుంజుకోవడం, సరఫరా పరిస్థితుల్లో క్రమంగా మెరుగుదల కారణంగా పనితీరు గాడిలో పడిందని కంపెనీ పేర్కొంది. స్టాండెలోన్‌గా చూస్తేక్యూ2లో కంపెనీ నికర లాభం స్వల్పంగా రూ.1,359 కోట్ల నుంచి రూ.1,372 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం 9.7 శాతం వృద్ధి చెంది రూ.17,689 కోట్లుగా నమోదైంది.
అమ్మకాలు 16 శాతం అప్...: క్యూ2లో మారుతీ మొత్తం అమ్మకాలు 16.2 శాతం వృద్ధితో 3,93,130 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీ వాహన విక్రయాలు 18.6 శాతం పెరిగి 3,70,619 యూనిట్లకు ఎగబాకాయి. క్యూ2లో మొత్తం 22,511 వాహనాలను కంపెనీ ఎగుమతి చేసింది. 12.7 శాతం వృద్ధి సాధించింది. ‘తొలి త్రైమాసికంలో రెండు నెలల పాటు ఉత్పత్తి సున్నా స్థాయికి పడిపోయిన నేపథ్యంలో, దీంతో పోలిస్తే క్యూ2లో మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్–19 ప్రతికూలతలు నెమ్మదిగా సద్దుమణుగుతున్నాయి. మా ప్లాంట్లలో ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి రానున్న కాలంలో పటిష్టమైన వృద్ధిని ఆశిస్తున్నాం. వచ్చే కొద్ది నెలల్లో డిమాండ్ మెరుగైన స్థాయిలో నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో తక్షణం ప్రయాణికుల వాహనాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను తగ్గించాల్సిన అవసరం లేదు’ అని కంపెనీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు.
ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు గురువారం బీఎస్‌ఈలో 1 శాతం క్షీణించి రూ.7,114 వద్ద స్థిరపడింది.
మారుతీ లాభం రూ.1,419 కోట్లు
Published Fri, Oct 30 2020 6:14 AM | Last Updated on Fri, Oct 30 2020 6:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment